కీచక వధ4

చూస్తుండగానే నిండురాజసభలో ఈమెను అవమానించాడు. సర్వసమర్థులైన గంధర్వులైన నా భర్తలు నా పరాభవాన్ని చూస్తూ ఊరికే ఎందుకు ఉన్నారని అడుగగా ధర్మరాజు చెప్పాడు. ఏదైనా పని ఉందేమో?తరువాత ప్రతీకారం చేస్తారేమో, నువ్వట్లా అనుకోవడం తప్పన్నాడు. కాబట్టి అందరికీ కీచకుడు చేసిన దురాగతం తెలుసు. ద్రౌపది మాటలలో నిర్ణయించిన పరిణామమూ తెలుసు. కాబట్టి ఆమె వచ్చి ‘కీచకుడు గంధర్వపతులచే.’, అనగానే అందరూ జాగ్రత్తపడి ఏమైంది అని చూశారు.

క.            నా పతులగు గంధర్వుల
    
               చేపడి మృతిఁబొందె వీఁడె సింహబలుం
          
               డీ పాపాత్మునిఁ జూడుఁడు దు
         
               ర్వ్యాపారఫలంబుఁ గాంచె’ నని పలుకుటయున్.             (విరాట. 3-3)

               ‘నా పతులగు గంధర్వుల చేపడి’ – నా పతులైన గంధర్వుల చేత చిక్కి ‘మృతిఁబొందె వీఁడె  సింహబలుండు’ – ‘ఈ సింహబలుడు అంతమొందాడు. చూడండి' అంది.

ఉపకీచకుల శోకం - ప్రతీకార ప్రయత్నం

               అంతా అంధకారం. ప్రశాంతమైన వాతావరణం, అర్థరాత్రి. అక్కడ జరిగిన విషయం వీళ్ళ ముగ్గురికి తప్ప ఎవ్వరికీ తెలియదు. భీముడు వెళ్ళిపోయాడు. చడీ చప్పుడూ లేదు. ద్రౌపది వెలుపలికి వచ్చి, హాహాకారాలతో చెప్పింది. అంతఃపురంలో కలకలం చెలరేగింది. కావలివాళ్ళు వచ్చారు. ‘వారు సంభ్రమించి వడిఁ గోల దివియలు గొనుచు’ – కావలివారు దివిటీలు తీసుకుని, ‘ఉలివు మిగులఁ గూడఁ బాఱి నృత్తశాలఁ జొచ్చి రత్తఱి నా కలకల మెఱింగి’ – వచ్చారు. ‘ఏమైంది చూద్దాం, ఎవరున్నారో తెలియదు. ఆమె గంధర్వపతులు అంటున్నది. కనపడతారో లేదో! మనమేమీ అపకారం చెయ్యలేదు. అయినా మనకేమైనా అపకారం జరుగుతుందేమో’ అని వాళ్ళు చేసిన కోలాహలాన్ని విని ఉపకీచకులు చాలా వేగంగా అక్కడికి వచ్చారు. ‘అక్కడ ఉన్నట్టుండి రాత్రిసమయంలో ఏమిటీ గగ్గోలు? ఉన్నట్టుండి ప్రశాంతవాతావరణంలో ఈ కేకలేమిటి? ఈ అరుపు లేమిటి? కిటికీలోనుంచీ చూశారు. అక్కడే కీచకుడి మందిరముంది.

కీచకుడికి నూటఐదుమంది సహోదరులు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి చూశారు. ఏమిటిది? అది మూడోజామో నాలుగో జామో? కాసేపట్లో సూర్యోదయమౌతుంది. రాత్రి పూర్తి కాలేదు. అర్థరాత్రి గడిచి కొంత సమయమయ్యింది. ఈ కలకలమేమిటని చూశారు. ఆ దీపపు కాంతిలో కావలివాళ్ళు, పహరావాళ్ళు నాట్యశాలవైపు పరిగెత్తుతున్నారు. అక్కడ ఎవరిదో ఒక స్త్రీ గొంతు వినపడింది. ఏమిటీ అని చూస్తూ, బయటకి వచ్చారు. ‘కీచక వ్రజంబు’ - వ్రజం అంటే గుంపు. కీచకుల గుంపు. ‘కడు వెస వచ్చి’ - ‘ఏది? జరగండి, జరగండి’ అంటూ లోపలకు వెళ్ళి చూశారు. ‘ఎక్కడ గంధర్వులు? ఎక్కడ కీచకుడు? ఎక్కడ సింహబలుడిని మర్దించారు, ఎక్కడున్నాడా సింహబలుడ’ని గుమిగూడి చూస్తున్నారు. చూస్తే ఆ మధ్యలో ఉందొక ఆకారం. ‘రూపఱిన కాయము నున్న’ - రూపం లేదక్కడ శరీరానికి. స్వరూప లక్షణసమన్వితమైన శరీరం అక్కడ కనపడటం లేదు. ‘రూపఱిన కాయము నున్నతెఱంగుఁ జూచి బిట్టడలు మనంబులం గదిరి’ - ఒక్కసారి వాళ్ళ మనసు ఆ హృదయమనేది ఎక్కడో పాతాళలోకానికి తీసుకుని పోయినట్లయింది. భయం విపరీతంగా కలిగితే, ఏ విధమైన భావం వస్తుందో, వాళ్ళకు ఆ వెలితి కలిగింది. మనసు ఏ భావంలేక ఖాళీ అయిపోయింది. ‘హా యనువారును’ - అయ్యో! అని అరిచారు. ‘చోద్య మంది మ్రాన్పడియెడువారును’ - ఇలా జరిగిందా? ఎవరు? ఇది నిజమేనా? మా అన్నగారేనా? అని ఆశ్చర్యపోయి బిగుసుకుపోయారు, ‘అగ్రజునిపైఁ బడి మూర్ఛలం బొందువారు’ అన్న శరీరంపై పడి గుండెలవిసేట్లు హాహారాకాలు చేశారు. 

Player
>>