కీచక వధ5

       సైరంధ్రి కీచకుడే అని నిర్ణయించి, నిశ్చయించి చెప్పింది. అక్కడ ఆ ఆభరణాలున్నాయి. కీచకుడు చేసుకున్న అలంకారాలు, అతనికి సంబంధించిన విషయాలు ఎక్కడా చెడిపోలేదు. ‘అయ్యెడ కరుగంగ నోర్వక’ – కొంతమందికి దగ్గరకు వెళ్ళి చూడటానికి మనసు రాలేదు. ‘ఓర్వక మహిం బెఱచోఁ’ – అతిభయంకరంగా ఉన్న అన్నగారి శవాన్ని చూడలేక నేలమీద పడి పొర్లుతూ శోకాలు మొదలుపెట్టారు. ఒక్కసారి నూటఅయిదుమంది శోకాలు మొదలుపెడితే ఏవిధంగా ఉంటుందో ఊహించుకోండి. ఒకొక్కడు ఒక్కొక్క స్థాయిలో ఉన్నారు. ‘ఉన్నంత బంధుజనంబులు గూడంబారి’ - రాజబంధువులంతా వచ్చారు. సింహబలుడంటే సామాన్యుడు కాడు. సుదేష్ణాదేవికి తమ్ముడు, రాజ బంధువు. ఆ విరాట సామ్రాజ్యానికి సేనాధిపతి. ఆ బంధువులంతా కూడా వచ్చి కీచకశవాన్ని గుర్తించి నిశ్చేష్టితులైపోయారు. ‘కీచక శవంబు కనుంగొని’ - కీచక కళేబరాన్ని చూశారు. కీచకుని బాహ్యలక్షణాలు తప్ప శరీరంలో గుర్తుపట్టడానికి ఇంకేమీ లేదు. అది భీముని మహిమ. ఆ విధంగా చేసి పెట్టాడు.

       ‘మానవకోటి నిట్టి విసుమానపుఁ బీనుఁగు లైనవారి నెందైనను’- ఎప్పుడైనా ఎక్కడైనా మనుష్యులలో ఇంత వికృతంగా శవాకృతి దాల్చిన వాడిని చూశామా! ‘ఎందైనను కంటిమే? అకట! యాఱడి వమ్మయి పోయె; దుర్జయంబైన బలంబు గాని తెరువై తన కిత్తఱిఁ దోడు గాద’- ఇంత అన్యాయం, ఈ విధంగా గర్వాంధకారంతో మదమెక్కి ప్రవర్తిస్తే చిట్టచివరకు కలిగే ఫలితమిదే కదా అనుకున్నారు. ‘క్రొవ్వినఁ జేటు తప్పునే?’- జరిగినంత కాలం జరిగిపోతుంది కాని దాని తరువాత వచ్చే పర్యవసానం, తప్పుతుందా? అన్ని వైభోగాలు జరిగిపోతూనే ఉంటాయి. కాని ఎప్పుడైతే దుర్దశ వచ్చి పడుతుందో అప్పుడు అది వీటన్నిటినీ కూడి దానిని చక్రవడ్డితో లెక్కవేసినట్లు రెండింతలో, మూడింతలో అయి పడుతుంది. దానికి తగిన పరిహారం చెల్లించుకోవలసి వస్తుంది. ‘క్వా శ్చ గ్రీవా? క్వా శ్చ చరణౌ?’- అన్నట్లుగా ‘కరములెయ్యవి? శిరమేది? కాళులెచటఁ జొచ్చె?’- చేతులేవి, తల ఏది? కాళ్ళు నడవడానికి కదా! అవెక్కడకి పోయాయి. ‘గంధర్వ వరులచేఁ జచ్చువాలరెల్ల నిట్టుల యగుదురో’ – గంధర్వులచేతిలో చస్తే ఇంత ఘోరంగా ఉంటుందా? జాగ్రత్తగా ఉండాలి మనం. ‘ఇతని తోడి యలుకఁ జేసిరొ? యిది కడు నక్కజంబు’ - ఇతని మీద వారికి ఇంత కోపం కలిగిందా? ఆశ్చర్యకరమైన విషయం!

      ‘అని వెండియు బహుప్రకారంబులం బలుకుచు శోకవిస్మయ పరీత చేతస్కులయి యున్నంత నొక యుపకీచకుండు’ - ఒక్కడికి కొంచెం వివేకం కలిగింది. నూటఅయిదుమంది వచ్చి, నూటఅయిదు విధాలుగా పలవిస్తూ ఉన్నారు. చేయగలిగిన కార్యమెవరూ చెయ్యలేదు. అంతలో ఒకడు హిరణ్యాక్షుని సంహారం తరువాత రోదిస్తున్న బంధువులను హిరణ్యకశిపుడు ‘ఎవ్వాడు భాషించు? ఎవ్వ డాకర్ణించు? ఆ జీవుడెన్నడో అరిగినాడు.'(మహా భాగవతం-సప్తమ స్కంధం) అని ఓదార్పు వచనాలు పలికినట్లు, కొంచెం తేరుకున్నాడు. -‘మనమెంత పనవి పిలిచిన విననేర్చునె సింహబలుఁడు?’- మనమెంత గట్టిగా ఎందరెన్ని విధాలుగా రోదించినా సింహబలుడు పలుకుతాడా?' -కాబట్టి సమాధానం రాదు కదా! ‘వేగమ యతనిం గొనిపోవఁగ వలయున్’ - ఇంకా ఇక్కడే ఉంటే అందరూ చూచి ఇదే విధంగా నానా దుర్భాషలు మాట్లాడుతుంటారు. సానుభూతి వచనాలు చెప్తుంటారు. కాబట్టి వెంటనే తెల్లవారక ముందే, తెల్లవారితే నగరప్రజలు, సేనావాహిని అందరూ రావొచ్చు. ఒక్కొక్కడు ఒక్కొక్క సానుభూతి చూపితే అది ఎంత హృదయవిదారకంగా ఉంటుంది? కాబట్టి వెంటనే వీడిని తీసుకొని పోవాలని నిశ్చయించుకుని, ‘కొనిపోవఁగ వలయుం గాకని యందఱఁదేర్చె ననున యాలాపములన్’ - అందరికీ అనునయవాద్యాలతో చేయదగిన పనిని చెప్పినాడు.

       ‘సూతులు దాని కియ్యకొనుచుం దమ యన్నకు నగ్ని యేర్చు వారై తగ వాచరించునెడ’ - ఉపకీచకులు తమ అన్నకు అంత్యసంస్కారం చేయటానికి బయలు దేరినారు. ద్రౌపది అక్కడే ఉన్నది. కావలివాళ్ళకి చెప్పింది ఆమే కదా! ఈ కలకలం జరుగుతుంటే ఎటూ వెళ్ళక ఒక మూల నిలబడివుంది. అప్పుడామెకు ‘ఈ కీచకుడు నన్ను ఇంతగా బాధించాడు. వీడికి తగిన ప్రతీకారం జరిగింది. ఇప్పుడు అందరూ వచ్చి చూస్తున్నారు. వీళ్ళు ఏ విధంగా వీడిని తీసుకుని పోతారు’ అనే కుతూహలం కలిగింది. అంతవరకు ఆ వెనుక ఉన్న ఆమె ‘వీరి చందముల్ సూతము గాక అని నొకచోఁ దమ చేరువనున్నఁ గాంచి’ - ఏం చేస్తారు? ఎలా తీసుకువెళతారు? చూడాలి. వీడొక ముద్ద. గోనెసంచిలో వేస్తారా? నెత్తిన పెట్టుకుని పోతారా? ఒక నిర్దిష్టమైన 

Player
>>