కీచక వధ6

ఆకారం లేని వీడికి సంస్కారం చేయడానికి ఎలా తీసుకుని పోతారని చూస్తున్నది. నూటఅయిదుమంది కీచకులు ఆమెను చూసేటప్పటికి, ఆమెవల్ల కదా తమ అన్నకు ఈ స్థితి అని వాళ్ళకు దుఃఖము, ఆవేశము, కోపము, రోషము, అన్నీ ఒక్కసారి కలిగాయి. ‘సంజాత మహోగ్ర కోపులయి చారు విలోచనఁ బట్టి’- ఆ భయంకరమైన కోపంతో ద్రౌపదిని పట్టుకుని

క.            పెడకేలు గట్టి ‘పాపపుఁ    
               బొడవగు నిది గాదె యితనిఁ బొడ వడఁగించెన్ 
               గెడకూడఁదీని నీతని         
               యొడలిపయిం బెట్టి కాల్చు టుచితం బరయన్                 (విరాట. 3-13)

               ఈమె వల్ల కదా ఇదంతా జరిగిందని ‘పెడకేలు గట్టి పాపపుఁ బొడవగు నిది’ - పాపానికి పరాకాష్ఠ ఈమె. ‘పొడవు’ పాపము అనే దాన్ని దీర్ఘీకరిస్తే అది ఎంత పొడవవుతుందో, దానికి పరాకాష్ఠ స్థితిలో ఉన్నది ఈ సైరంధ్రి. ‘కాదె యితనిఁ బొడ వడఁగించెన్’ - పాపానికి పొడవైన ఈమె ఇతని పొడవు అడగించింది. వీడి పరాక్రమాన్ని ఈ గతికి తీసుకునివచ్చింది. వాడి జీవనాన్ని తగ్గించింది కదా! ‘కెడ కూడఁ దీని నీతని యొడలిపయిం బెట్టి కాల్చు టుచితంబు’ - కాబట్టి ఇతనితో ఈమెను దహించటమే సముచితం. కాని ఈ పని చేయాలంటే, రాజు అనుమతి లేకుండా చేస్తే శిక్షను తమ చేతిలోకి తీసుకున్నట్లు అవుతుంది. ఉపకీచకులకు ఆ అధికారంలేదు. దండనీతి అధికారం లేకుండా ఎవరైనా సంహరిస్తే అది హత్యానేరమవుతుంది. కాబట్టి రాజశాసనాన్ని ఉల్లంఘించడానికి వీలు లేకుండా, విరాటుడికి ఊరికే మాట మాత్రం చెప్పి ఈ పని చేస్తామని ఆమెను పట్టుకున్నారు. ‘అని విరాటున కెఱింగించి చేయువారై’ - విరాటుని దగ్గరకి వచ్చారు.

       ఉపకీచకులు వస్తూనే ‘ఈమెవలననే ఈ పరిస్థితి వచ్చింది, ఈ సైరంధ్రివల్ల మన రాజ్యమంతా నాశనం అవుతుంది కాబట్టి ఈమెను చంపివేస్తామ’ని అన్నారు. ‘అంతకు మున్న యీ వృత్తాంతంబంతయు విని’ – అంతకుముందే విరాటుడు కీచకుని సంహరించిన వృత్తాంతం గురించి విని విచారంతో ఉన్నాడు. ‘విని సంక్షుభిత హృదయుండై యున్న యతని పాలికింబోయి’ – ఆసమయంలో ఉపకీచకులందరూ విరాటుని దగ్గరకి వెళ్ళారు.

తే.           ‘ఎల్లభంగుల సైరంధ్రి నేము సింహ   
               బలునితోఁ జంపు వారమై తలచి నీకు
               నెఱుఁగఁజెప్పంగ వచ్చితి మీవు నింత
               వట్టు మన్నన మాకు నీ వలయు’ ననిన                         (విరాట. 3-15)

       ‘ఎల్లభంగుల’ - ఏది ఏమైనా సరే, -‘సైరంధ్రి నేము సింహబలునితోఁ జంపువారమై తలచి నీకు నెఱుఁగఁ జెప్పంగ వచ్చితిమి’– ‘మేము సైరంధ్రిని చంపాలని నిశ్చయించుకున్నాము. కేవలం తెలియచేయడం కోసం వచ్చాం’. ‘ఈవు నింత వట్టు మన్నన మాకు నీ వలయు ననిన’- ఇంత వట్టు దేనికి? మేము నీకు చెప్తున్నాము. విన్నానని అంగీకరిస్తే చాలు అంతే! నువ్వేం చెప్పినా మేము మాత్రం తగ్గేది లేదు. ఈ సైరంధ్రి కారణంగా మా అన్నగారికి ఈ అవస్థ వచ్చింది కాబట్టి దీన్ని ఉపేక్షించేది లేదు. ఈమె పోతే కాని మాకు ఊరట లేదు. ఈమె నశిస్తే గంధర్వులు ఏమవుతారో అది వేరే విషయం. మా ప్రతీకారం నెరవేరుతుంది.' అని చెప్పారు. ‘అతండును దన మనంబున నియ్యుపకీచకుల చందంబు సూడ నేను వారించితి నేనియు నుడుగం గల వారుగారు’– ‘ఈ ఉపకీచకులు నా మాటలు లక్ష్యపెడతారా’ అని ఊహించి ‘వారలం గలయం గనుంగొని యట్లకాక మీకుం బోలిన తెఱంగు సేయుం డనిన’ – మీకు తోచినవిధంగా చేయండి అని విరాటుడు ఏమీ చేయలేక అంగీకరించాడు. 

Player
>>