ఉపకీచకుల దురాగతం1

ద్రౌపది ఆక్రందన - ఉపకీచకుల సంహారం

            ద్రౌపదికి ఏం చేయాలో తెలియలేదు. ‘తాను ఆ నిముషంలో కుతూహలాన్ని అణుచుకుని బయటకు రాకుండా ఉంటే ఇలా జరిగేది కాదు కదా!’ అని చింతించింది, ఇప్పుడు ఒకటే ఉపాయం ఉందని తలచింది. తన భర్తలను వారి సంకేతనామములతో పిలవడమే మార్గమని నిశ్చయించుకుంది.

            ‘ఆనతవైరి యోజయ’ - వీళ్ళందరూ విరాటనగరంలోనికి వెళ్ళేటప్పుడు ధర్మరాజు అందరికీ సూచించాడు. మనకు ఎవరికి, ఎప్పుడు, ఎటువంటి అవసరం వస్తుందో తెలియదు. కాబట్టి నా పేరు కంకభట్టు కావచ్చు. నీ పేరు దామగ్రంధి కావచ్చు, వలలుడు కావచ్చు, బృహన్నల కావచ్చు, సైరంధ్రి కావచ్చు. కాని మనమందరం ఐదుగురికీ సంకేతనామాలు పెట్టుకోవాలి. ఎవరైనా, ఎవర్నైనా, ఎటువంటి అవస్థలోనైనా సంబోధించి పిలవవలసిన అవసరం వస్తే ఈ సంకేతనామములు జయ, జయంత, విజయ, జయత్సేన, జయద్బల అని నిర్ణయించాడు. ఇప్పుడు ద్రౌపదికి ఆ అవసరం ఏర్పడింది. సింహబలుడిని గంధర్వులు చంపారని చెప్పింది కనుక ఆ గంధర్వులనే పిలిచే నెపంతో వారిని ఎలుగెత్తి పిలిచింది. ఆ పిలిచినప్పుడు ఎలా తిరిగింది? ఆమె పిలుస్తున్న ధోరణి ఎలా ఉంది అంటే వాళ్ళు తనను తీసుకుని పోతున్నప్పుడు తన ఆక్రందన దూరదూరంగా వున్న వాళ్ళకు వినపడాలి. అయ్యో! రండి అని పిలవాలి. ఈ పద్యం అదేవిధంగా ఉంటుంది.

ఉ.         ఆనతవైరి యోజయ! మహాద్భుత విక్రమ యో జయంత! దు
                               ర్మానవిఘూర్ణమానరిపుమర్దన యో విజయాభిధాన! తే
    
            జోనిహతాహిత ప్రకట శూరగుణ ప్రతిభాస యో జయ
            త్సేన! విరోధి బాహుబల జృంభణభంజన యో జయద్బలా    (విరాట. 3-21)

‘ఆనతవైరి యోజయ’ - దగ్గరే ఉన్నాడని, జయ అనే సంకేతనామము ధర్మరాజుది. ‘మహాద్భుత విక్రమ యోజయంత’ - ఎవరు మహాద్భుత విక్రముడైన జయంతుడు? భీముడు. వంటశాలలో వున్నాడు. కొద్ది దూరంలో. ‘దుర్మానవిఘూర్ణమానరిపుమర్దన యో విజయాభిధాన!’- విజయుడు అర్జునుడు. నాట్యాచార్యుడు. ఇతని మందిరం ఇంకా దూరంగా వుంది.  ‘తేజోనిహతాహిత ప్రకటశూరగుణ ప్రతిభాస యో జయత్సేన!’- నకులుడు, అశ్వశిక్షకుడు. ‘విరోధి బాహుబల జృంభణభంజన యో జయద్బలా!’- సహదేవుడు గవాధ్యక్షుడు. వీళ్ళిద్దరూ దాదాపు పుర బహిఃప్రాంతంలో వున్నారు. ఆవేగంతో ఎక్కడో ఉన్న వాళ్ళను పిలిచే దీర్ఘమైన పిలుపు. వారి వారి వృత్తి   కనుగుణమైన ఆవాసమందిరాలలో దూరదూరంగా వున్న పాండవులను ఒక్కొక్కరిని పేరు పేరునా పిలిచిన సంబోధనలలోని సమాసముల కూర్పు, క్రమక్రమంగా దీర్ఘమై, దీర్ఘతరమై, దీర్ఘతమమై అజ్ఞాతసమయ సంకేతనామధేయాలతో వున్న వారికి శ్రవణగోచర మయ్యే విధంగా ద్రౌపది ఆక్రందన.

Player
>>