ఉపకీచక సంహారం1

తే.         ఇట్లు లంఘించి పోయి పరేత భూమి 
            
            యొద్ద నలుదిక్కులును జూచి యొక్క యున్న 
  
            తావనీజంబు వెఱికి రౌద్రాతిరేక 
      
            మడర భుజశిఖరంబున యందమర్చి                               (విరాట. 3-24)

 

            ‘ఇట్లు లంఘించి పోయి పరేత భూమి యొద్ద నలుదిక్కులును జూచి’ వీళ్ళు అక్కడికి రాక ముందే చేరుకున్నాడు. ఏ విధంగా వీళ్ళను ఎదుర్కోవాలి అని నాలుగు వైపులా చూశాడు. ‘ఒక ఉన్నత అవనీజంబు’ బ్రహ్మాండంగా పెరిగిన ఒక చెట్టు కనపడింది. చాలు మనకు పనికొస్తుంది. నూట అయిదు మంది వచ్చినా వాళ్ళను చీమలో, దోమలో నేలమీద పడితే ఊడ్చేయడానికి ఏ విధంగా చీపురు తీసుకుంటామో, వీళ్ళను ఊడ్చేయడానికి ఇది మనకు పనికొస్తుందిలే అని -‘ఉన్నత అవనీజంబు పెఱికి రౌద్రాతిరేక మడర భుజశిఖరంబునయం దమర్చి’- ఆ వృక్షాన్ని పెకలించి, కోపం కమ్ముకొస్తుండగా భుజాలపై పెట్టుకున్నాడు. ఆ ముఖకవళిక ఎలా మారిపోయింది? నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో, క్రోధంతో పళ్ళు పటపట కొరుకుతూ, ఒక ప్రళయ భీకరాకారం అక్కడ ప్రత్యక్షమైంది. ఒక పెద్ద చెట్టు తీసుకుని నిలబడ్డాడు. ఆ నిలబడినప్పుడు ఎట్లా ఉన్నాడు?

మ.        వికట భ్రూకుటి ఘోర ఫాలకలిత స్వేదోద్భటుండుం జల
   ద్వికృతోష్ఠద్వయుఁడుం, బ్రమర్దన దశావిర్భావ సంభావితాం
            గకుఁడుం, జిత్త విదాహదోహల సమగ్రక్రోధ వేగుండు నై 

            బకవిధ్వంసకుఁ డయ్యెడన్ నిలిచె శుంభన్మూర్తి విస్ఫూర్తితోన్               (విరాట. 3-25)

            ‘వికట భ్రూకుటి ఘోర ఫాలకలిత స్వేదోద్భటుండు’ ఉపకీచకులు ప్రేతభూమికి వచ్చేసరికి వికటించిపోయిన ఆ భ్రూకుటితో, కళ్ళు విశాలములై, చెవులు పొంగి, తెరిచి ఉంచిన నోటి చివర్లలో నుంచి వస్తున్న దంత సంఘట్టన ధ్వనులు వినపడుతుంటే ఎర్రబారిన ముఖంతో ఉన్న ఒక భీకరాకారం కనపడింది. ‘చల ద్వికృతోష్ఠద్వయుఁడు’ రెండు పెదవులు కోపంతో వణుకుతున్నాయి. అదురుతున్న పెదవులు కలిగినవాడై, -‘ప్రమర్దన దశావిర్భావ సంభావితాంగకుఁడున్,'- ఉపకీచకులను సంహారం చేయటానికి అనుకూలమైన శరీరావయవ విక్షేపంతో, -'చిత్త విదాహదోహల సమగ్రక్రోధవేగుండు’- చిత్తము, ఆయన మనసు ‘విదాహం’ దహించుకునిపోతున్నది. ‘సమగ్ర క్రోధవేగుండునై బకవిధ్వంసకుఁ డయ్యెడన్’ మిక్కుటమైన క్రోధావేశంతో బకవిధ్వంసకుడు - సామాన్యుడు కాదు. బకాసురుడిని చంపాలని ఏకచక్రపుర ప్రేతభూమికి పోయి సంహరించి వచ్చినవాడు, ఆ భీముడు, ‘బకవిధ్వంసకుఁ డయ్యెడన్ నిలిచె శుంభన్మూర్తి విస్ఫూర్తితోన్’, భయంకరాకారంతో అక్కడ నిలిచాడు.

            ఈలోగా ఉపకీచకులు అన్న మరణానికి విలపిస్తూ, ఆ మరణానికి కారణమైన ద్రౌపదిని నిందిస్తూ అక్కడికి చేరుకున్నారు.

Player
>>