వేగుల నిరాశ1

సింహావలోకనం

            పాండవులు విరాటనగరంలో చేస్తున్న అజ్ఞాతవాసం దాదాపుగా పూర్తి కాబోతూ ఉండగా విరాటదేశానికి సర్వసైన్యాధ్యక్షుడు, రూపాభిమాని, విరాటునికి బావమఱఁది అయిన కీచకుడు తన అక్క సుదేష్ణకు నమస్కరించడానికి వచ్చి ఆ చేరువలో ఉన్న ద్రౌపదిని చూసి, మదనపరవశుడై, వివశుడై, వివేకహీనుడై తన భర్తలైన అయిదుగురు గంధర్వులు తనను ఎల్లవేళలా కాపాడుతుంటారని ద్రౌపది  హెచ్చరించినా, అక్క సుదేష్ణ వారించినా, వినక ఆమె వెంటబడి నిండుసభలో అవమానించాడు. ఈ అవమానానికి ప్రతీకారంగా భీముడు గంధర్వుల భ్రాంతి కలిగిస్తూ కీచకుడిని, అతని సోదరులైన నూటఅయిదుమంది ఉపకీచకులను మట్టుపెట్టాడు. ఈ ఉదంతానికి భయపడి, విరాటరాజు ఆదేశంతో సుదేష్ణ ద్రౌపదిని తమ రాజ్యం వదిలిపొమ్మంది. ద్రౌపది ఇంకొక పదమూడురోజులు తనను ఉండనివ్వమని తరువాత తన భర్తలైన గంధర్వులు వారికి తప్పక మేలు చేస్తారని చెప్పి ఆమెను ఒప్పించింది. ఈ వ్యవహార మంతా ఒకటి రెండు రోజులలో సద్దుమణిగిపోయింది.

            కానీ అక్కడి ప్రజలు కీచకుని గురించి సింహబలుడంతటివాడు అంతకు ముందురోజు దాకా బాగానే ఉన్నాడు, విశేషమైన అలంకారాలు చేసుకున్నాడు. ఆ తరువాత ఏమయ్యిందో కానీ ఉదయానికి రూపు కూడా గుర్తుపట్టలేని విధంగా శవమై కనిపించాడు’ అని అనుకుంటున్నారు.

            ‘అట్టి యెడ నిట్లని మ్రోసిరి జనులు పురము నందును భూమిన్’- ఈ సమయంలో ఆ నగర ప్రజలు అనుకుంటున్న మాటలు అన్నిచోట్లకు వ్యాపించసాగాయి. ‘విరటు మఱంది కీచకుఁడు విక్రమదుర్దముఁ డన్యసైన్యభీకర మహనీయమూర్తి బలగర్వ సముద్ధత చిత్తుఁ డెందు నెవ్వరు సరిలేరు వీని కన వాలిన దండిమగండు’- కీచకుడు తనకు ఎదురే లేరనుకునే వాడు, ‘సూడ నచ్చెరు వగుచావు సచ్చె’- ఆశ్చర్యమైన చావు చచ్చాడు, ‘అటు సేసిన వారట యెట్టి వీరులో?’- ఆ విధంగా వాడిని చేసినవారెవరో! ‘సింహబలుఁడు గంధర్వులచేత నొక్క సతికిగాఁనిట్లు ఘోరంపుఁ జావు సచ్చె’- అంత బ్రతుకు బ్రతికి ఒక్క స్త్రీకోసం ఇంతటి ప్రమాదాన్ని తెచ్చుకున్నాడు.

            ‘అకట! రిత్తకు రిత్త మత్స్యావనీశు లావు గోల్పోయె’- విరాటమహారాజు కుడిభుజం పోయింది. బలం తగ్గిపోయింది. ఇంతకు ముందులాగా విజృంభించి ఏ పనీ చేయడానికి లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతకుముందు ఎవరు వచ్చినా లెక్క చేయని స్థితి అతనిది. సింహబలుడు, ఉపకీచకుల మరణంతో ఆయన బలగం తగ్గి పోయింది. ‘సూతకులంబు వొలిసె’- కీచకులనే వాళ్ళు నశించిపోయారు.

            ‘ఇవ్విధంబున బ్రవర్తిల్లు జనవాదంబు గ్రమక్రమంబున సమస్తదేశంబుల నెరసి చెల్లుచుండె నట్టియెడ’- ఈ విధంగా జనులు మాట్లాడుకుంటున్న మాటలు ఒక ఊరినుంచి ఇంకొక ఊరికి అలా ప్రచారమవుతూ పోతున్నాయి.

Player
>>