ధర్మరాజు మహత్వం1

దుర్యోధనుని మంత్రాంగం

              తిరిగి కథలోకి వస్తే, సుయోధనుడు సభ తీరి ఉన్నాడు. ఇంతలో వేగులవారు వచ్చారు.

          అజ్ఞాతవాసం అంతరించటానికి ఇంకా ఎంత సమయం మిగిలి ఉంది? అసలు అయిపోయిందా? ఈ విషయాన్ని ఎవరూ ఆలోచించటంలేదు. దుర్యోధనుడు పంపిన వేగులవారు అనేక ప్రదేశాలు చూసి అనేక విధములైన ప్రయత్నాలు చేసి వారి బుద్ధి కుశలతనంతా ఉపయోగించి అనుభవసారాన్ని జోడించి నిష్ఫలురై అతని దగ్గరకు వచ్చి, ‘మేము వారిని చూడలేకపోయాము, వాళ్ళు ఈ భూమిమీద ఉండి వుండరు, ఒక వేళ జీవించి ఉంటే మాకు కనపడకుండా ఉండడం సాధ్యం కాదు. మేము చేయదగిన ప్రయత్నం మేము చేశాము. కాని ఒక ఆసక్తికరమైన విషయం విన్నవించాలి.

            విరాటరాజుకు సేనాధిపతిగా ఉన్న కీచకుడిని గంధర్వులెవరో సంహరించారు. కీచకుడినే కాదు, కీచకునితో పాటు అతని సహోదరులైన నూటఅయిదుమంది ఉప కీచకులను కూడా రాత్రికి రాత్రి చాలా విచిత్రమైన రీతిలో ఆయుధాలతో పని లేకుండా కాళ్ళు, చేతులు తల డొక్కలోనికి జొనిపి మర్దించారు.’ విచిత్రమైన ఆ కీచకుని మృతిని గురించి వేగులు వర్ణించి చెప్పారు. చివరగా ఒక మాట చెప్పారు. ‘కీచకుడు, మత్స్యదేశాధీశుడు కురురాజులకు శత్రువులు కావున శత్రువుల ఖేదము తమకు ప్రమోద కారణంబని ఈ వార్త చెపుతున్నా’మని అన్నారు. దుర్యోధనుడు ఆ మాటలను విన్నాడు, భీష్ముడు, ద్రోణుడు ప్రక్కనే ఉన్నారు. అందరూ విన్నారు.

         దుర్యోధనుడు తీవ్రంగా ఆలోచించి ‘సరే మీకు తరువాత చేయవలసింది చెప్తాను వెళ్ళండి’ అని వాళ్లను పంపించిన తరువాత పాండవులను ఏ విధంగా కనుగొనవచ్చునని అందరినీ అడిగాడు.

            ‘పాండవుల ఉనికిని తెలుసుకోవడం కష్టమే. మీరు ఆలోచించి ఎలా తెలుసుకోవాలో  నాకు తెలియచెప్పండి’ అని ఊరుకున్నాడు. చక్రవర్తి, సార్వభౌముడు, మహారాజు అంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు, కార్యనిర్దేశం చేసి మంత్రులవైపు చూశాడు. ఇంకా చాలామంది రహస్య వేషాలను ధరించిన వేగులవారిని పంపి మళ్ళీ నలుదిశలా గాలించటం ఒక పద్ధతి’ అని కర్ణుడు సూచించాడు. దుశ్శాసనుడు నవ్వి, ‘ఇంతవరకు మన వేగులవాళ్ళు చేసిన పని అదే కదా, వాళ్ళు ఎప్పుడో చనిపోయి ఉంటారు, వాళ్ళు మరణించిన చోట గడ్ది కూడా మొలిచి ఉంటుంది’ అన్నాడు. ఈ రెండూ విన్నాక ద్రోణుడు ఒకే ఒక మాట చెప్పాడు. ‘ఇది చాలా అవివేకమైన మాట. పాండవులు ఆత్మతపస్సంపన్నులు కాబట్టి వాళ్ళకు దైవ సహాయం ఉంటుంది. అదీ కాక వారు ధర్మ నిరతులు, మహాపరాక్రమవంతులు. వారిని మృగాలు, క్రిమి కీటకాలు ఏవో సంహరించాయి అనే ఆలోచన అర్థరహితమైనది. కాబట్టి వారికి ఏ హాని జరిగి వుండదు. భద్రం గానే ఉండి వుంటారు. కాకపోతే వాళ్లను ఎలా గుర్తించాలి అనేది ఆలోచించాలి’ అని అన్నాడు. భీష్ముడు వింటున్నాడు. ద్రోణాచార్యుడు ఎప్పుడైతే ‘వాళ్లు మరణించి ఉండరు, వారు మహాపరాక్రమవంతులు’ అని అన్నాడో వెంటనే ఆయన లేచాడు. ఆయన శరీరం పొంగింది. ‘నల్లవొ’- చాలా మంచి మాట చెప్పావు! అన్నాడు. ‘నిక్కమాడె’- ‘ఇంతమందిలో ద్రోణుడు ఒక్కడు నిజం చెప్పాడు. వాళ్లకు బాహుబలం, ధీబలం, దైవబలం మూడూ ఉన్నాయి కాబట్టి వాళ్లు ఎక్కడ ఉండాలి అనే దాన్ని ఒక ఊహ చేత భావించకుండా, పాండవులు ముఖ్యంగా ధర్మరాజు ఉన్న ప్రదేశంలో ఎటువంటి లక్షణాలు ఉంటాయో అటువంటి దేశానికి వేగులను పంపిస్తే వాళ్లను కనుక్కోవచ్చు’ అని ఆ లక్షణాలను వివరించి చెప్పాడు.

Player
>>