దక్షిణగోగ్రహణం1

దక్షిణ గోగ్రహణం

              తిక్కనగారి భారతంలో బహుళాష్టమినాడు ముహూర్తము పెట్టారు. వ్యాసుల వారి భారతంలో ముహూర్తము ఏదీ లేదు.

క.         బహుళాష్టమి నీతడు స
న్నహనముతోఁ బసులఁ బట్టు, నవమిని మన గో
గ్రహణ’మని నిశ్చయించిన
నహికేతను పలుకులకు మహాహ్లాదమునన్.        (విరాట. 3. 129)

            అష్టమి, నవమిలలో చేసే కార్యక్రమం విఘ్నకారకమవుతుందని నానుడి. ఈనాడు కూడా అష్టమినాడు మనం ప్రయాణాలు పెట్టుకోము. ఈ నమ్మకం తెలుగు భారతంలో అష్టమినాడు ముహూర్తము పెట్టిన తర్వాత  ప్రబలిందో లేక తిక్కన గారి నాటికే ఉన్నదో -  అష్టమినాడు ముహూర్తము పెట్టాడు. ఈ గోగ్రహణ రచనలో మనం గమనించవలసినది దుర్యోధనుని సూక్ష్మగ్రాహ్యత. ఎంత చక్కని వ్యూహరచన!  పాండవులు  కలుగులోని ఎలుకల్లాగ ఎక్కడ దాగి వున్నా బయటకు వచ్చే విధంగా సందర్భాన్ని సృష్టించాడు.

              ఈవిధంగా సుశర్మతో సమస్త బలాలను సమీకరించుకుని సహాయం అందించమన్నాడు. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, వీళ్ళందరూ వెనకే ఉండిపోయారు. ఎందుకంటే పాండవుల వంటి వారు యుద్ధానికి వస్తే ప్రతిఘటించ వలసిన వారు వీరు. అందుకని కురుయోధులనందరినీ తన దగ్గరే పెట్టుకుని మిగిలిన వారిని సుశర్మకు సహాయంగా పంపించాడు. వీరు ఈ సన్నాహంలో ఉండగా, పాండవుల అజ్ఞాతవాస సమయం పరిసమాప్తి కావచ్చింది. ఈ సంగతి గమనించిన వారు ఎవ్వరూ లేరు.

            ‘సుశర్మయు’- అనుజ్ఞ లభించింది కాబట్టి ‘ఏలిన వాని పనిఁ బూని’- తాను సామంతుడు, దుర్యోధనసార్వభౌముని ‘పని బూని జోడు పక్కెర కైదువు బిరుదు రవణంబు మొదలైన సవరణంబులతో చూడ నక్కజంబుగా కూడి’- తిక్కన మనుమసిద్ధి రాజ్యాన్ని సంపాదించి ఇచ్చే సమయంలో ఎన్నో యుద్ధాలు చూశాడు. ఆయన యుద్ధాలు చేశాడో లేదో తెలీదు కానీ, యుద్ధాలు నిర్వహించిన మేథాసామర్ధ్యం మాత్రం వుంది. ఆ ప్రావీణ్యత నంతటినీ తిక్కన మన కళ్ళముందు సాక్షాత్కరింపజేస్తున్నాడు.

Player
>>