విరాటుని యుధ్ధప్రయాణం1

విరాటుని యుద్ధసన్నాహం

            ‘అడ్డపడియెడు దీవసమెదఁ గలిగెనేని దేవర కడఁకన్’- వాళ్ళను అడ్డగించాలనే ఉద్దేశం తమకు మనసులో వుంటే వెంటనే వెళ్ళాలి. ఉపాయంతో వెంటనే పరాక్రమించాలి. ఈ రెండు మాటలు చెప్పేటప్పటికి ‘అనిన విని విరాటుం డదరిపడి’- ఒక్కసారి అదిరిపడి నిన్న మొన్న కీచకుడు చనిపోతే, ఇంతలోనే త్రిగర్తదేశాధీశుడైన సుశర్మనుండి ఇంతటి సమస్య వచ్చిందా. ‘ఏమీ నిక్కమె’- నిజమా? ‘త్రిగర్తదేశ సుశర్మయేనా వచ్చినది?’

             ‘ఏమీ నిక్కమె! మున్నెఱుంగఁడె త్రిగర్తేశుండు’ ఎలా పరాభవాన్ని పొందాడో తెలీదా? ‘మద్గోధన స్తోమంబుం గొనిపోవు తెంపునకు నుద్యోగించెనే? మేలుమేలు’- నాకు సంబంధించిన గోధనాన్ని అపహరిచేందుకు తెగించాడా? మంచిది! ‘ఆమై తోడనె పోవుఁగాక!’- ‘ఆమై’, ఆ శరీరం, ‘తోడనె పోవుఁగాక!’- ఆ విధంగానే నశిస్తుంది. ‘ఆమై తోడనె’- ఆ విధంగానే నశించిపోతాడు. గోవులను ఏ విధంగా తీసుకుపోగలడో అదీ చూస్తాం. ఆ విధంగానే వాణ్ణి కూడా పంపిస్తాను. అని ‘వీరాలాపముల్ పల్కి యుద్దామ క్రోధ శిఖాకలాప వికటోద్య ద్ర్భూకుటి స్ఫూర్తియై’- అందరూ ఆయన ముఖం వైపు చూశారు. ఈ విరాటరాజులో ఇంత కోపము ఎక్కడినుంచీ వచ్చింది. సామాన్యంగా విరాటరాజు కోపగించుకున్న సందర్భం ఎక్కడా కనపడదు. దానికి తోడు ధర్మరాజు పక్కనే వుంటే అసలే వుండదు. ధర్మజుడు పక్కనే ఉంటే భీముడు లాంటి వాడే శాంతమూర్తి అవుతాడు. విరాటరాజు ఏం చేస్తాడు?

            అటువంటి శాంతమూర్తికి ఆ మాటలు వింటూనే కోపం వచ్చింది. అందరికీ ఆయన ముఖంలో విశాలమైన కళ్ళు, ముక్కు, పెదవులు, చెవులు ఇవి ఏవీ కనపడలేదు. వాళ్ళు చూసినది కోపంతో ముడిపడిన ఆయన భ్రుకుటి. ఆ స్ఫూర్తి ఎలా ఉన్నది? ‘ఉద్యద్భ్రూకుటి’ బాగా ప్రకాశవంతమై ముఖాన్నంతా ఆక్రమించుకోలేదు. వికటంగా  క్రోధశిఖాకలాపం అయ్యింది. కలాపము అంటే కొలను. శిఖ అగ్ని. కోపము అనే అగ్నికీలల చేత ముడివేసినట్లు ఉన్న భృకుటిని చూశారు. చూసిసచివుల వెసన్ మన మెయ్దక తక్కినం బశుప్రచయము తప్పిపోవు’- మనం ఈ విషయాన్ని విస్మరించి ఆలస్యం చేస్తే పశు సంపద కోల్పోతాము. ‘తుది భంగము సేఁగియు వచ్చు’- చివరకు అవమానమే మిగులుతుంది, ఆపద కలుగుతుంది. కాబట్టి వెంటనే వెళ్ళాలి. ‘మీరుచిత విధాన సత్వరత నుద్ధత యోధ సమగ్రవాహినీప్రచలిత భూమి భాగముగఁ బన్నఁగఁ బంపుఁడు’- భూమి దద్దరిల్లేటట్లుగా మన సైన్యం తీసుకువెళ్లాలి. ఈ సందర్భాన్ని మీరు తేలికగా తీసుకో కూడదు. వెంటనే ప్రయాణానికి సన్నాహాలు చేయండి. ‘పంపుడు దండనాథులన్’- సేనానాయకులను వెంటనే పంపించండి. ఆలోచించడానికి సమయం లేదు. అని నియోగించి ‘యాన ప్రక్రమ సూచకంబులగు తూర్యంబుల్’- రాజుగారు యుద్ధానికి బయలుదేరిన గుర్తుగా రణభేరి నినాదాలు వేయించి ‘దిశాపాటనధ్వాన స్వైరవిహారకల్పిత సముద్ర క్షోభముల్ గా’- నలుదిక్కులా సముద్రములు ఉప్పొంగి ఘోషిస్తున్నాయా అనే విధంగా ఆ తూర్యనాదాలు గంభీరంగా మ్రోగాయి.  ‘తురి అయి తూర్యరావాలు’ అక్కడికి వినపడాలి. వినపడి వారు భయంతో పారిపోవాలి. తమ శక్తి సామర్థ్యాలను ఎన్ని విధాలుగా వీలయితే అన్ని విధాలుగా ప్రకటించాలి. అందుకని ‘ధరిత్రీ నాథుండు రణోచితోద్యమము సంధిల్లంగ శస్త్రాస్త్ర వర్మానీతిక్రమ చక్షులం బనిచె నయ్యై వారికిం గ్రక్కునన్’- శస్త్రములు, అస్త్రములు, వర్మములు, వర్మములు అంటే కవచము. ‘వృణోతీతి వర్మః వృఞ్’ అనే ధాతువునకు కప్పునది అని అర్థం. శరీరాన్ని కప్పి ఉంచుతుంది కాబట్టి ఇది కవచం – వర్మం అయ్యింది. నానా విధములైన కవచములతో, రక్షణ విషయాలతో, ఆయుధాలతో అందరిని సమాయత్తం చేశారు. సారథివైపు చూశాడు. యుద్ధరంగంలో సారథి అత్యంత కీలకమైన పాత్రను వహిస్తాడు. సారథి బలహీనుడైతే యోధుడు పరాక్రమవంతుడైనప్పటికి నీరుగారి పోవలసినదే.

Player
>>