సుశర్మ, విరాటుల సంగ్రామం1

యుద్ధభేరి

            ఊకుమ్ముడిగా ఇవన్నీ సమకూరి వెళ్ళేటప్పటికి సుశర్మ సైన్యం తోలుకుని వెళుతున్న గోవులకాలిగిట్టలతో  రేగిన ధూళిధూసరం కనబడుతోంది. ఆ సంరంభంలో త్రిగర్తుల బలాన్ని చెల్లాచెదురుచేసి గోవులను తీసుకుని రావాలనే సంరంభంతో చుట్టుముట్టే ప్రయత్నంతో ‘గంధ దంతావళ కర్ణమారుతహతిఁ, గాంతారములు చాఁపకట్టు వడఁగ’- యుద్ధసంబంధమైన మదించిన ఏనుగులు మావటివాడు చేసిన అంకుశపు పోటుతో అనుసరించుకొని భయంకరమైన వేగంతో పరిగెత్తేటప్పటికి, ఆ ధాటికి ‘దంతావళముల కర్ణ మారుతహతిఁ చేసి కాంతారములు’, ఆ అరణ్య ప్రదేశమంతా చాప చుట్టగా పడిపోయింది. ‘రథ ఘోషమునఁ బ్రతిరవ మిచ్చు నద్రులు’- ఈ రథఘోషకు ‘అద్రులు’ – పర్వతములు ప్రతిస్పందిస్తున్నాయి. ‘భయమున వాపోవు భంగి నుండఁ’- బయలు స్థలము కాబట్టి రథాలు పోయే వేగానికి అది ప్రతిధ్వనిస్తుంది. ఆ ప్రతిధ్వని పర్వతాలు భయపడుతున్నట్లుగా  ఉన్నది. ‘రథ ఘోష బ్రతిరవమొకటి’ ఆ పర్వతాలలో వినవచ్చే ప్రతిధ్వనితో త్రిగర్తదేశం స్తంభించి పోతుందా అనిపిస్తున్నది. ‘తురగ ఖురోద్ధూత ధూళి దన్బెరసినవననిధి పిండలి వండు గాఁగ’- అశ్వములు పరుగెడుతుంటే ఆ కాలిగిట్టలతో వచ్చిన దుమ్ము సముద్రంలో పడి, అందులోని నీరు ఇంకిపోయి బురద అయిపోయింది. ‘బహుళ పదాతి దుర్భరభార మడరిన నురగకూర్మంబు లొండొంటిఁ బొండ’-

            కాల్బలం నడుస్తోంది. చతురంగబలాలను నడిపిస్తున్నాడు. అందులో కాల్బలం సేనలు పరుగెత్తుతుంటే వారి పదఘట్టనల తాకిడిచేత భూమిని మోస్తున్న ఆదిశేషుడు, ఆదికూర్మము, రెండూ కొద్దిగా చలించి, భూమిని మోయడానికి ఒక దానికి ఒకటి ఎదురు వచ్చాయట. ఆ సైన్యసంరంభానికి ఇది ఉత్ప్రేక్ష. ప్రేక్ష అంటే చూడటం. ఉత్ప్రేక్ష అంటే ఉన్నతంగా, గాఢంగా పైకి లేచి చూడటం.

            ధర్మరాజాదులు వాళ్లను అనుసరించిపోతున్నారు. సేనకు నాయకత్వాన్ని పూనినది విరాటరాజే. విరాటరాజు సైన్యాన్నంతటినీ నిర్దేశించి నడిపించుకు వెళుతున్నాడు. ‘విరటు బలంబు త్రిగర్తేశ్వరు బలమున్ చెలగనార్చి వడితాకెన్’- భయంకరంగా సమర సన్నద్ధములైన సేనావాహిని తలపడింది. ఎంతోదూరం పోకముందే వీళ్ళను పట్టుకొని పారి పోతున్నవాళ్ళను ముట్టడించి శరాఘాతములచేతనో కరములచేతనో ఒడిసి పట్టుకొనో ఆపి వేశారు. ఆ సైన్యం ఇటువైపుకు తిరిగింది.  త్రిగర్తేశ్వరుడు కూడా రథ, హయ, గజ, కాల్బములతో కూడిన చతురంగబలాలతో వచ్చి ఆవులను తీసుకువెడుతున్నారు. ‘గుణ రావంబు కృపాణ ఘట్టన రవక్షోబంబులున్’- ఒకచోట లేదు. రథాలు, గజాలు, అశ్వాలు, కాల్బలము అన్నీ బారులు తీరి ఒకే వరుసలో ఉన్నాయి. కాబట్టికృపాణము - ఖడ్గచాలనం’- చేస్తూ యుద్ధం చేసేవారు ఉన్నారు. రథముల మీదినుంచీ శరసంధానం చేసే వారు ఉన్నారు. ఈ శరసంధానం చేస్తున్నప్పుడు బాణం వింటికి ఎక్కు పెట్టి నారిని సారించినప్పుడు, ఝుమ్మనే నాదము వెలువడుతుంది.

            గుణము అంటే వింటికి కట్టిన అల్లె త్రాడు. దానిని పట్టుకొని లాగాడు. ఆ గుణరావంబు, దాని ధ్వానము, ‘కృపాణ ఘట్టన రవక్షోభంబునుం గింకిణీ క్వణన వ్యావృత హేషితస్వనములున్’- ‘హయహేషలు’ గుఱ్ఱములు భయంకరంగా సకిలిస్తే ఆ కింకిణీ నాదం, పక్కనున్న గజ్జెలు, వాటి మ్రోతతో కూడుకొని ఉంది. ‘కింకిణీ క్వణన వ్యావృత హేషిత స్వనములున్ ఘంటా నినాదాత్త పోషణ నానాపటు బృంహిత ధ్వనియు’- ఏనుగులు ఘీంకారం చేస్తున్నాయి. వాటికి గంటలు కట్టారు. ఆ ఘంటికానాదం ‘శశ్వద్ఘాఢమై పేర్చినన్ రణనం బించుక దోఁప లేద బహుతూర్యశ్రేణి సేనలన్’- ఈ సైన్యముల కలకలారవముచేత శంఖనాదాలు కాని, రణభేరులధ్వానం కాని వినపడలేదు.

Player
>>