విరాటుని పోరు1

సంకుల సమరం

ఒక్కొక్కరూ ఒక్కొక్క విధంగా యుద్ధం చేస్తూ, ఒక్కొక్క బాధను అనుభవిస్తున్నారు. ‘ఒండొరు మీరు కోర్కిమెయి నొక్కట బాసలవారు సొచ్చినన్’- ప్రతిజ్ఞ పట్టి కొంతమంది వస్తున్నారు. ‘రెండయి పాయ యిచ్చిన’- ఆ బలం ఎదురు ఉంటే రెండు విధాలుగా వచ్చి, వాడు దగ్గరగా వచ్చిన తరువాత ‘అరిప్రకరంబులు వేఱువేఱ యుద్దండ భుజాబలం బలరఁ దాఁకిన’- శత్రువులు వాణ్ణి చుట్టుముడితే ‘సంగడిఁ బాఱుచుండఁగా’- ఆ సందడిలో వారు ‘గండమరంగ నిల్చి చెలికాండ్రయి గ్రమ్మఱ వత్తు రిద్దఱున్’- అటు వెనుకకు వెళ్ళి మళ్ళీ ముందుకు వస్తున్నారు. యుద్ధభూమిలో ఎవడు ఎవడితో తలపడుతున్నాడో తెలియడం లేదు. ఒక్కడు పదిమందితో, పదిమంది ఒక్కడితో, పదిమంది మూకుమ్మడిగా ఇంకొక బలముతో తలపడవచ్చు. ‘ఒక్కఁడు పెక్కండ్ర కెక్కిన విచ్చియుఁ బొదవి చెఱొకపోటు వొడుచు నెడలుఁ’, ‘పలువు రొక్కనిమీఁదఁ బఱపిన సైరించి నళికి పైఁ బెట్టగ’- మహా భయంకరమైన యుద్ధం జరిగింది. వీళ్లందరూ ఒక్కొక్కరూ తమ తమ ప్రతిభాపాటవాన్ని చూపుతుంటే, రణరంగం భీకరమైపోయింది. తెగిపడుతున్న చేతులు, చెదిరిపోతున్న శిరస్సులు, ఖండింపబడిన కాళ్ళు, సగానికి నరకబడిన గుఱ్ఱాలు, విరిగి తునకలుగా పడిపోయిన రథాలు కనిపిస్తున్నాయి. ఈ యుద్ధం ఇలా జరుగుతూ ఉంటే, అందరూ తమ తమ ప్రతాపాలను చూపిస్తున్నారు. ‘అయ్యవసరంబునం దక్కిన దొరలును దలపడి యతి భీమంబుగా సంగ్రామంబు సేయం దొడంగిన’- అలా భయంకరంగా అందరూ యుద్ధం చేస్తూ ఉండగా విరాటుడు ‘అనుజ తనూజ మంత్రి సుభటాప్తజనంబుల పోరు చూచి నెమ్మనమునఁ బొంగి’- తన తమ్ముడు, పుత్రుడు, బంధువులు వీళ్ళందరూ చేస్తున్న యుద్ధపరాక్రమానికి పొంగిపోయాడు.

అతిశయించి మై పెనిచి’- శరీరము ఉప్పొంగి ‘మత్స్యమహీరమణుండు సారథిన్ గనుఁగొని’- తన సారథిని చూచి, ‘అల్ల కంటె’- అక్కడ చూశావా ‘మొనఁ గ్రాలుచు నున్న త్రిగర్తనాథుకేతనమున’- త్రిగర్తనాథుడైన సుశర్మ కేతనము, ‘త్రిగర్తనాథు కేతనమున చక్కటిన్ మన రథంబు వెసం జన నిమ్ము నావుడున్’- సుశర్మ కనిపించాడు. దుమ్ము, ధూళితో నిండిపోవటం వలన ఇప్పటివరకు కనపడలేదు. అదిగో అక్కడ ఉన్నాడు. అక్కడికి మన రథాన్ని తీసుకొనిపో! వాడి పనిపట్టాలి. ‘అగ్గలిక నతఁడు హయముల పగ్గంబులు సడల విడిచి’- అంతవరకు బిగపట్టి పట్టుకొన్న గుఱ్ఱపు పగ్గాలను కొంచెం వదిలాడు. ‘పటురయమున నా మొగ్గరము దఱియఁ బఱపిన మ్రగ్గెను రథపంచశతము మత్స్యాధిపుచేన్’- వేగంగా రథబలాన్ని ఛేదించుకొని ఆ త్రిగర్తాధీశుడైన సుశర్మ దగ్గరకు పోయాడు.

ఆ దృశ్యాన్ని చూసి తమ చక్రవర్తి, విరోధి దగ్గరకు వెళ్ళేటప్పటికి, తక్కిన సైన్యం వివిధాయుధములతో శత్రువులను ఎదుర్కొన్నది. నారదుడు ఆ యుద్ధాన్ని చూచి కుంచె చేతితో పట్టుకొని ‘పిచ్చలించి ఆడి’ ఉత్సాహంతో నర్తించాడు. ‘ఇవ్విధంబున విరాటుండు తానును సేనయుం జేయం గలవారును,  పరవశంబుసేసి యొక్కుమ్మడి నడరుటయుం’- ఒక్కసారిగా తన సేనలు రథ సమూహంతో ఆ సుశర్మను చుట్టుముడితే ‘కోపాటోపంబునం గెంపు గదురు లోచనంబులుం బెంపొలయు భుజ శిఖరంబులుం గలిగి సుశర్మ తానుం దమ్ముండును’- సుశర్మ తమ్ముడు విరాటసైన్యాన్ని చూసి, ‘సంగడంబుగాఁ’- జోడుగా కలిసికట్టుగా, ‘కోల్తల సేసి’- తన సమూహముతో విరాటుని ఎదుర్కొన్నాడు.

విరాటుడు తనను సుశర్మవద్దకు తీసుకొని పొమ్మని సారథితో అన్నాడు కాని తన వెంట శతానీకుడు, శంఖుడు ఎవరూ లేరు. కానీ సుశర్మవద్ద అతని తమ్ముడు మొదలైనవారు అందరూ ఉన్నారు. ‘కోల్తల జేసి రథసమూహంబుతో విరాట వ్యూహంబు నెదుర్కొని బలవిక్రమములు మెఱయఁగఁ దలపడి రథ దంతి హయ పదాతి చయంబుల్ కలను సుడివడఁగఁ’- వారందరూ తమ తమ బలాలతో విజృంభించారు. త్రిగర్తబలాలు ఉన్నట్లుండి చొచ్చుకొని వచ్చివ విరాటుడిని చూసి భయంతో తల్లడిల్లిన వారు సుశర్మ తమ్ముని బలాన్ని చూసి ఉత్సాహము తెచ్చుకొని తిరగబడి వాళ్లందరూ విరాటుణ్ణి చుట్టుముట్టేటప్పటికి ఆయన వారిమధ్య చిక్కుకొని పోయాడు.

Player
>>