పాండవులు విరాటుని రక్షించుట1

భీముని వీర విహారం

అట్టి యెడ ధర్మతనయుఁ డనిలనందను నవలోకించి’- ఆ సమయములో ధర్మరాజు భీముని చూచి ఇంతవరకు విరాటరాజు యుద్ధం చేస్తుంటే పెద్దగా మన పరాక్రమాన్ని చూపించలేదు. కాని అశక్తుడైపోతున్న సమయంలో మన యుద్ధకౌశలము చూపించాలి. ‘అవలోకించి సత్వరంబగు చిత్తముతో మత్స్యవిభని వలను సూపుచు నిట్లనియె’ ‘ఇతని ఆశ్రయమున మనమెల్ల బ్రతికి యున్నవారము’- విరాటుని చూపుతూ మనకు అజ్ఞాతవాసములో ఇతను ఆశ్రయము ఇచ్చాడు. కావున ‘ఉగ్రరిపుల పాలు పడకుండ విడిపింపఁ బాడి యితని నెయిదు మెయిదుము’- ‘ఎయుదు మెయుదుము’ ఇతన్ని శత్రువుల పాలబడకుండ కాపాడటం మన విధి. వెంటనే పద. ‘ఎయుదు మెయిదుము రథరయ మెసకమెసఁగ’- వేగంగా నీ రథాన్ని ఆ వైపుకు తీసు కొని వెళ్లు. ‘అనవుడు మేను పెంచుచు’- భీముడికి కావలసినదదేగా, యుద్ధోత్సాహంతో శరీరము ఉప్పొంగిపోయింది.

మేను పెంచుచు మహాబలనందనుఁ డప్పు డన్న కిట్లను’ ‘ఇదే సాలవృక్షము రయంబున దీన నరాతిసేన డొల్ల నడిచి సుశర్ముని బలంబుఁ జలంబును మాన్పి యవ్విరాటుని విడిపించెదన్ రణపటుత్వము వైరులు పిచ్చలింపఁగన్’- ఇదుగో ఇప్పుడే పోతున్నాను, ఇదిగో సాలవృక్షము. ‘చాలిది’- ఈ సాలవృక్షమే చాలు. దీనిని పెఱికి వాళ్ళనందరిని ‘ఊడ్చి పట్టి’- కట్టగట్టి నీకు తెచ్చిస్తాను. ‘నీవుఁ దమ్ములు నొక్కెడ నిలిచి చూచుచుండుడు’- మీరందరు నిలిచి చూస్తూ ఉండండి. అని పల్కుటయుఁ బుయిలోట తోడఁ’- ధర్మరాజుకు కొంచెం కలవరం కలిగింది. పుయిలోట’ అనే పదాన్ని నాలుగోసారి వింటున్నాము.

యుద్ధం చేయమంటే చెట్లు పెరికేస్తానంటున్నాడు అనే సందేహం ధర్మరాజు మనసును కలచి వేసింది. ‘కీచకారాతిఁ దప్పకచూచి’- నాయనా! కీచకుల సంహారం రహస్యప్రకారం కాబట్టి చెట్టు తీసుకొని వెళ్ళావు, బాగానే ఉంది. ‘అతనికి ఇట్లని చెప్పె ధర్మాత్మజుండు’ ‘తరువు వెసఁబెఱికి కొని నీ వురవడిమైఁ గవిసితేని’- ఆయుధాలను వదిలి చెట్లు పెకలించి ఆంజనేయక్రీడగా బయలుదేరితే, ‘ఉభయబలము నచ్చెరవందుచుఁ జూచి వృకోదరుఁడ వగుట యెఱుఁగకున్నె’- నీవు భీముడవని అందరూ తెలుసుకోరా! తిక్కనగారి లోని పలుకుపటుత్వము అది. ‘తద్విధమేలా?’- ఆ పని ఎందుకు నాయనా! ఈ వాత్సల్యముతో కూడిన శాసనం ఇదన్నమాట.

Player
>>