ధర్మరాజు సుశర్మను విడిపించుట1

పలాయన పరాయణంబులై వెనుకొని యెయిది గోధనవర్గంబు మరల్చి కరి తురగ రధంబులం దలమీఱి పొదివి తెచ్చి, యన్నపాలికి వచ్చి తాను మున్ను త్రిగర్తేశు రథంబు కడ నిలువ నియోగించి’- త్రిగర్తేశుణ్ణి పట్టుకున్నాడు. విరాట రాజును విడిపించాడు. సుశర్మను కట్టిపట్టి తెచ్చాడు. ‘నియోగించి నిలువ’- సుశర్మను అక్కడ నిలబెట్టాడు. యుద్ధమై పోయింది. సాయంత్రమై సంధ్యాచీకట్లు కమ్ముకుంటున్నాయి. ‘తమ్ములం గూర్చుకొని తమ యంతవట్టును నొక్కట విరాటునకుం బొడచూపిన తమ్ములన్’ - అందరిని చూపించాడు. ‘ఆదరము సంభ్రమంబును మోదంబును దన మనమున ముప్పిరిగొన భూదయితుఁడు’- ఒక్కసారి విరాటునకు సంతోషం కలిగింది. అవతలివైపు ఇంక యుద్ధం చేసేవాడు ఎవడూ లేడు. తనకు బంధవిమోచనం కలిగింది. సుశర్మను పట్టుకున్నారు. గోధనాలను మరల్చారు.

క.         మానముఁ బ్రాణముఁ గాచితి
దీనికి సరిగాఁగ నీమదికిఁ బ్రియ మెసఁగం
గా నాకుఁ జేయ నయ్యెడు
దాని నెఱుగఁ గాన మత్సదము గైకొనవే.                     (విరాట. 3. 223)

దీనికి సరికాగ’ నా మానము, ప్రాణము రెండు కాపాడావు. కాబట్టి నీవే రాజువు. ఈ రాజ్యమే నీకిస్తున్నాను తీసుకో అన్నాడు. ‘అనిన విని అజాతశత్రుం డిట్లనియె’ ‘మనుజ వరేణ్య! నావలని మన్నన యట్టిద కాదె’- నీవు నా పట్ల చూపే గౌరవం అట్టిదే కదా! సత్కార్యము చేసినట్టు గౌరవాన్ని చూపిస్తున్నావు. ‘శత్రుమర్దన మొనరించి మత్స్య నగరంబున కుత్సవ ముల్లసిల్ల నీ చనుటయ నాకుఁ దేజమును సంపదయున్ గరిమంబుఁ గాక యిట్లనఁ దగునయ్య?’ విరాటనగరానికి శోభ సంతరించుకునేటట్లు ఉత్సవంగా ఇక్కడి నుంచీ గో ధనాన్ని మరల్చుకొని పోవడము నాకు చేసే సత్కారమే కదా. దానివలన కలిగే  ఆనందమే అధికం. ఇవన్నీ నాకెందుకు?

ఇదేమిటి రాజ్యము ఇస్తాను అంటే వద్దంటున్నాడు. వేరొకరైతే ఆక్రమించుకొని ఉండేవారు కదా! ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోక ఆశపడకుండా ఉన్నాడే! ‘ఉపకారమొ బంటుదనమొ కృపయో పెంపో’- అయ్యా! నీ అంతరంగం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఒకసారి కల్లోలితమనస్కుడనైతే శాంతవచనాలు చెప్పి సాంత్వనం చేకూర్చావు. వినోదంకోసం పాచికలాడి వినోదాన్ని కలుగజేస్తావు. ధర్మసందేహాలు కలిగితే నివారిస్తావు. ఈ పని చేయ వచ్చునా లేదా అనే సందిగ్ధస్థితిలో ఉంటే పరిష్కారము చూపు తావు. ఈ రోజు ఈ యుద్ధానికి వచ్చి ఇంత సహాయం చేశావు.

క.         ఉపకారమొ బంటుతనమొ
కృపయో పెంపో సమగ్రకీర్తి ప్రియమో
రిపుదుస్సహమగు నీ రణ
నిపుణతకున్ కారణంబు నెయ్యమొ యెఱుఁగన్.              (విరాట. 3.228)

నీవింతలా యుద్ధంలో నైపుణ్యం చూపించి నాకు మేలు చేయడానికి నా పట్ల గల కృపయో, ఉపకారం చేయాలన్న ఆదర్శమో లేక నా పట్ల నీకు గల స్నేహభావమో ఏది కారణమో తెలియకుండా ఉన్నది. ‘మంటయుఁ బోని శాత్రవసమాజమును’- ఈ శాత్రవ సమాజము మండిపోతున్న మంటలాగా ఉన్నది. మంటయుఁ బోని శాత్రవసమాజము నించుకయేని శంక లేకంటఁగఁ దాఁకి వెండి తెగటార్చె మహాద్భుతశక్తిశాలి వంటలవాని’ - ఈ వంటలవాడు మంటల వలె ఉన్న శత్రువులను ‘అంటగ’ సమీపించినాడనే అర్థం. మరొక అర్థం ఆ మంటకు మంట పెట్టాడు. ‘అంటగ జేసి దాఁకి వెండి తెగటార్చె మహాద్భుతశక్తిశాలి వంటలవాని చేసిన నవార్య పరాక్రమ మొండుచోటులం గంటిమె? వింటిమే? యితఁడ కాఁడె వెసన్ గెలిపించె న న్ననిన్’- ఎదురులేని ఈ వలలుని పరాక్రమం ఇంకెక్కడా వినలేదు, కనలేదు. ఈ యుద్ధంలో నన్ను గెలిపించినది ఇతడే కదా!

Player
>>