ఉత్తరగోగ్రహణము1

ఉత్తర గోగ్రహణం

దక్షిణ గోగ్రహణంలో సుశర్మతో జరిగిన భయంకరమైన యుద్ధంలో సుశర్మను ఓడించి, బంధించి, మళ్ళీ బంధ విముక్తుడిని చేసి, ధర్మజ భీమ నకుల సహదేవులు విరాటరాజుతోపాటు విరాటనగరానికి తిరిగివస్తున్నారు. చీకటి పడింది. ఒక నదీతీరంలో విశ్రాంతి తీసుకున్నారు. దక్షిణగోగ్రహణం జరిగిన మరుసటిదినము కౌరవులు వెళ్ళి ఉత్తరగోగ్రహణము చేయాలి అని దుర్యోధనుడు వేసుకున్న ప్రణాళిక ప్రకారము

క.         సూర్యోదయావసరమున
దుర్యోధను బలము ప్రబల దోర్బలలీలా
ధుర్యగతి నడచె భీష్మా
చార్య రవిసుతాది యోధ సంఘోద్భటమై.                       (విరాట. 4. 3)

దుర్యోధనుని సైన్యము భయంకరమైన వేగముతో ప్రయాణించింది. కర్ణుడు, భీష్ముడు, ద్రోణుడు, కృపుడు మొదలుగాగల యోధులతో కలిసి వెళ్ళి, ‘నడచి మత్స్య నగరంబున కనతి దూరంబున విరాటు పశుగణంబులం బొదవె’- మత్స్యదేశమునకు ఉత్తర భాగమున ఆ ప్రదేశములోని గోవులనన్నింటిని పట్టుకున్నది. ‘అట్టియెడ, మృక్కడి మూఁకలు సని యెక్కడెక్కడ యని తలపడినం’- అక్కడి గోపాలకులు ఆవులను మరలించుకొని వెళుతున్న సైనికులు ఎవరో తెలీకపోయినా వాళ్లతో తల పడ్డారు. ‘కృప, అశ్వత్థామ, శకుని, దుశ్శాసన, కర్ణ, వికర్ణ, దుర్ముఖ, ప్రముఖ రథిక జనంబులు’- ఎదుర్కొంటున్నది గోపాలకులు, పశుపాలకులు. వీళ్లకు యుద్ధకౌశలము ఏముంటుంది. కేవలం పశువులను రక్షించుకోవడానికి సమర్థులు కాని ఇటువంటి మహాయోధులను ఎదుర్కొనే రణరంగపాండిత్యము లేనివారు.

కృపుడు, అశ్వత్థామ, శకుని, దుశ్శాసనుడు, కర్ణుడు, వీళ్ళందరు తమ బాణ పరంపరలతో ‘అనర్గళప్రసారంబగు శరాసారంబునం గప్పినం’- కప్పివేయగా ఆ గోపాలకులు పరికించి చూశారు. ఆ కేతనాల మీద చిహ్నాలు ఉన్నాయి. వాటిని గమనించి ‘కని కౌరవ బలం బగుట యెఱింగి’- ఇది కౌరవబలమని గోపాలకులు గుర్తించారు. ‘బెగ్గలించి’- భయపడి ఆవేగముతో ‘గవాధ్యక్షుండు రథంబు తోలుకొని’- తన రథము తీసుకొని ఆ గోపాలకనాయకుడు వెంటనే బయలుదేరి ‘ఆక్రోశించుచుం పురంబున కరుగుదెంచి’- ‘అయ్యో! మన గోవులు పోతున్నాయి. కౌరవబలము వచ్చింది’ అని హాహాకారాలతో  నగరానికి వచ్చాడు.

సుశర్మతో యుద్ధానికి విరాటరాజుతో పాటుగా వీరులందరూ వెళ్లారు. నగరంలో సైన్యము లేదు. అందుకని గవాధ్యక్షుడు ఆక్రోశించుచు నేరుగా ‘రాజమందిర

ద్వారంబుఁ జొచ్చి రథావతరణంబు చేసిన’- రాజమందిరానికి వెళ్లి రథాన్ని దిగి లోపలికి వెళ్ళాడు. ‘అంతఃపురంబున నున్న భూమింజయుని గాంచి’- విరాటరాజు పుత్రుడు ఉత్తర కుమారుడు. అతనికి మరొకపేరు భూమింజయుడు. ‘ససంభ్రమంబుగా నిట్లనియె’ ఆ ఉత్తరకుమారునితో భయపడుతూ ఇలా అన్నాడు. ‘ధరణీచక్రము సంచలింపఁగ సముద్ధాంతంబులై గ్రక్కునం కురుసైన్యంబులు వచ్చి ముట్టుకొనియెన్’- అయ్యా! కురుసైన్యాలు ప్రచండమైన వేగముతో, పరాక్రమముతో వచ్చి గోవులను మళ్ళిస్తున్నాయి.

Player
>>