ఉత్తరుని యుద్ధోత్సాహం1

గవాధ్యక్షుడు వచ్చిన సమయానికి ఉత్తరుడు రాజమందిరములో తన చెల్లెలు ఉత్తర, మిగతా అంతఃపురకాంతాజనుల మధ్య పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్నాడు. ‘అని కాంతాజనములలోఁ దను నగ్గించుటయుఁ బొంగి’- సాధారణంగా ఎవరినైనా ఇంద్రుడు, చంద్రుడు అంటే అంత ఉత్సాహము ఉండదేమో. కానీ పదిమంది అమ్మాయిల మధ్యలో ఉన్నప్పుడు నీ అంతటి పరాక్రమవంతుడు, అందగాడు, వీరుడు, శూరుడు లేడు అంటే కలిగే ఉత్సాహమే వేరు. అదే భూమింజయుడి విషయంలో కూడా జరిగింది. ‘కాంతాజనములలో తను నగ్గించుటయు’- అందరిలో తనను పొగిడేటప్పటికి వాళ్లవైపు చూసి మీసం మెలి వేశాడన్నమాట. నా ప్రతాపం చూడండి అని ఉత్సాహంగా ఉత్తరుడు ఇలా అన్నాడు.

నేను వెంటనే బయలుదేరి ‘ కౌరవులనెల్లను’- ఆ కౌరవులనందరిని ‘ఎత్తునగొందు’- ఒక్క ముట్టడితో వాళ్లను ఓడించి వేస్తాను. ‘మార్కొనిరేని’ వారు ఎదిరిస్తే. ఉత్తరుడు యుద్ధానికి వస్తున్నాడనే భయంతో వాళ్లు పలాయనమవుతారని ఉత్తరుని ఊహ. ఒకవేళ పారిపోకుండా యుద్ధములో నిలబడితే అప్పుడు ‘ఎత్తునఁ గొందు’.గోవులన్ దెత్తు ముహూర్తమాత్రమున’- ఆవులను చిటికెలో విడిపించి తీసుకొనివస్తాను. కానీ ‘తేరికి సారథి లేమి జేసి’- నా రథానికి సారథి లేడే. ఉండి ఉంటే వాళ్ళను పట్టుకొని ఆవులను తీసుకువచ్చేవాణ్ణి. ఇప్పుడు ఏమి చేయాలి? ‘సారథి లేమి జేసి నా చిత్తమునన్ విచారదశ’- వెళ్ళాలని మనసులో ఉంది. దానికి తగిన సామర్థ్యమూ ఉంది. కానీ సారథి లేకపోతే ఎలా వెళ్ళాలి? ఇప్పుడు అందరూ దక్షిణ గోగ్రహణ గోరక్షణకు వెళ్ళారు కదా!ఎవ్వడు కల్గునొక్కొ నాకిత్తరి’- ఈ విపత్కర సమయంలో,  ‘నే గదా కడప నెంతయు నేర్తు రథంబనన్’-  నీ రథానికి సారథ్యం చేస్తాను పద అనే  రథసారథ్య సామర్థ్యం కలిగినవాడు  ఎవ్వడూ లేడే! ఏమి చేయాలి?

 ‘తగుసారధి దొరకొనినన్ పగతుర బంధించుట ఎంతపని’- యుద్ధం చేసేవాడి నైపుణ్యము అంతా సారథ్యములోనే ఉంది. మంచి సారథి ఉంటే ఎంతసేపట్లో గెలువ వచ్చు? ‘కదుపుల దవ్వుగ కొనిపోదురొకో’- ఆలస్యం అయితే గోవులను దూరంగా తీసుకొని పోతారేమో? ‘ఇట్లగునె కలండేని సూతు నరయుం డెందున్’- ఎవరైనా సారథి ఉన్నాడా? ఉంటే చెప్పండి. ‘సూతును’, సూతుడు అంటే రథసారధి. ఇక్కడ ‘సూతును’ అంటే అటువంటివాడు ఉంటే సూతును - చూస్తాను. ఎవడైనా ఉంటే చూపించండి. ‘సూతును నరయుం డెందున్’- వాణ్ణి వెతికి పట్టుకొని రండి. చూస్తాను. ఈ సూతు పదం తిక్కనగారు రెండు అర్థాలను స్ఫురించేలాగా పెట్టాడు. సూతుడు - రథసారథి, సూతును-‘నేను చూస్తాను’ అని.

కురుపతి భీష్మ కర్ణ కృప కుంభజ ముఖ్యులు మత్సముద్యమ స్ఫురణముజూచి పార్థుడను బుద్ధి కలంగక పెట్టుగిట్టి’- నేను అక్కడ నా బాహుబలశౌర్యముతో యుద్ధ పరాక్రమము చూపిస్తుంటే, కురుపతి-దుర్యోధనుడు, భీష్ముడు, కర్ణుడు, కృపుడు, ద్రోణాచార్యుడు వీరందరు ‘మత్సముద్యమ స్ఫురణము చూసి’- నా రణకౌశలము చూసి, ‘పార్థుడను బుద్ధి’- అర్జునుడు అనుకునేరీతిగా యుద్ధం చేస్తాను. కాని ఒకటే ఇబ్బంది. సారథి లేడు కదా! ‘తగు సారథి దొరకొనినన్ తేరికి సారథి లేమిజేసి’- ఎంతసేపు ఆ పని? కాని సారథి లేడే?

Player
>>