బృహన్నల సారథ్యం1

ఉత్తరకుమారుడు ఈ విధంగా పలుకుతున్న మాటలను, ‘అనునప్పుడు తత్ప్రదేశంబున నునికిం జేసి విని ద్రుపదధరణిపతినందన’- ఆ అంతఃపురకాంతాజన సమూహంలో ఉన్న సైరంధ్రి-ద్రౌపది విని, ‘సామర్షాపహాస తరళ హృదయయై’- ఉత్తరుడు తనను అర్జునునితో పోల్చుకునేసరికి ఆమెకు సామర్ష-కోపం, అపహాసం కలిగాయి. ఒక్కసారి ‘తరళ హృదయయై’, మానసిక ఉద్వేగాన్ని పక్కకు నెట్టి సైరంధ్రి నేరుగా బృహన్నల వద్దకు వెళ్ళింది, ‘తద్వృత్తాంతము మెత్తని పలుకుల చెప్పె ఇంద్రతనయునితోన్’- ఆ వృత్తాంతమంతా మెత్తని పలుకులతో అతనికి చెప్పింది.

కౌరవుల మాట విన్న వెంటనే అర్జునుడు ఆలోచించాడు. ఎలా వచ్చారు? ఎలా తెలిసింది? కానీ క్షణంలో అర్థం అయ్యింది. వెంటనే లెక్కవేసుకున్నాడు. మన అజ్ఞాతవాసకాలం ముగిసిందా లేక ఎంత మిగిలి ఉన్నదా? కాలగణనము చేసి నిర్ణయించుకున్న అర్జునుడు, ‘అతండు అజ్ఞాతవాస వత్సరంబు అతీతంబగుట నిరూపించి’- ఆ రోజుతో తమ అజ్ఞాతవాస దీక్ష ముగిసిందని దృఢపరచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అర్జునుడు తనను బయల్పరచుకున్నా ఇబ్బంది లేదు. సర్వశాస్త్రఉపపత్తి ప్రకారంగా సమయము అయిపోయింది అని నిర్ధారణకు వచ్చిన అర్జునుడు పాంచాలికి ఇట్లనియె, పాంచాలితో ఇలా అన్నాడు.

ఇప్పుడు మనము విరాటరాజును కాపాడవలసిన పరిస్థితి వచ్చింది. ‘నీవు పోయి వారలతో నిట్లనుము మన బృహన్నలకు సారథ్యము చేయు సామర్థ్యంబు కలదు. తొల్లి ఖాండవ దహనంబునందు పాండవమధ్యమునకు సారథియై యతని చిత్తంబు వడిసె’- ఖాండవవన దహనసమయంలో అర్జునుడికి సారథ్యం చేసినది బృహన్నలే అని చెప్పు. ‘మఱియు బెక్కెడలం’- ప్రతి యుద్ధంలో ‘తదీయంబగు రథంబు కడప తానయై యుండు’- అర్జునుడు తన రథాన్ని నడపడానికి తానయైయుండు. ఎంత చక్కటి వాక్యవిన్యాసము! ‘తదీయము’ అంటే ఎవరిది, అర్జునుడిది. అర్జునుడు తన రథాన్ని తానే స్వయంగా రథాన్ని నడుపుకుంటూ యుద్ధము చేసే కౌశలము కలిగినవాడు కదా! అర్జునుడి రథం అతనే నడిపే వాడు అని చెప్పు. ‘నేను నెరుంగుదుం’- నాకు బాగా తెలుసు అని చెప్పు. ‘తత్సహాయంబునం కురుసైన్యంబుల జయింప వచ్చుటకు సంశయంబు వల దనుము’- ఈ మాటలన్నీ అర్జునుడు సైరంధ్రి వేషములో ఉన్న ద్రౌపదికి చెప్పి, నీవు వెళ్లి ఉత్తరునితో ఈ మాటలు చెప్పు అన్నాడు. ‘వారు ఏమనిరేని’- ఒకవేళ వారు ఆ బృహన్నల నాట్యాచార్యుడు, నృత్యవిద్య నేర్పేవాడికి సారథ్యము ఏమిటని సందేహిస్తే, ‘తగనాడి’- వాళ్ళకు తగిన సమాధానము చెప్పి, ‘నన్నుం బిలిపించునట్టి తెఱంగు గావింపు’- ఏవిధంగా అయినా సరే, నన్ను సారథ్యానికి ఆహ్వానించేలాగా చేయి అని చెప్పాడు. ‘అట్ల సేయుదునని సైరంధ్రి’- అలాగే చేస్తాను అని సైరంధ్రి ఎక్కడకు వెళ్ళింది? ‘ఉత్తర ఉన్న యెడకున్ పోయి’- ఇదీ ఔచిత్యం! ఉత్తరకుమారుడితో చెప్పటానికి కాదు. ఉత్తర ఉన్న ప్రదేశానికి వెళ్ళింది. వెళ్ళి,

 ‘జనపతినందనుండు తగ సారథి నారయుచున్నవాడు’- రాజకుమారుడు తనకు సారథి కావాలి అని అంటున్నట్లుగా విన్నాను. ‘ఎఱింగిన పని సెప్పగావలయు’- మరి తెలిసిన విషయము చెప్పాలి కదా! అందుకని ‘ఎఱింగిన పని సెప్పగావలయు’- నాకు తెలిసినంతవరకు చెప్తాను. ‘క్రీడి మనంబున మెచ్చునట్టి నేర్పును’- అర్జునుడు మెచ్చుకొనే నేర్పు, సామర్థ్యం కలిగిన, రథచోదకశక్తి కలిగినవాడు మన బృహన్నల. ‘అర్జునునకు ఖాండవ దహనాదులైన విక్రమము లా బృహన్నల వెరవు లావుగాదే’- ఖాండవదహనాదులలో అర్జునుడు గెలిచాడంటే, బృహన్నల సారథ్యం వలననే! ‘దీని నెఱింగింతము యుత్తరునకు’- ఈ విషయము ఉత్తరునితో చెప్తే కార్యము అయిపోతుంది పద అని ఉత్తరతో అన్నది.

ఉత్తర చిన్నపిల్ల కాబట్టి చనువుతో, సైరంధ్రి మీద గౌరవంతో అన్నగారితో చెప్పింది. అన్నయ్యా! నువ్వు ఏమీ భయపడవద్దు. మన దగ్గర ఉన్న బృహన్నల గొప్ప సారథి. అతను అర్జునునికి కూడా సారథ్యము చేశాడట! అర్జునుని విజయాల వెనుక అతని హస్తము ఉన్నదట. కాబట్టి బృహన్నల సారథ్యము చేస్తాడు అన్నది. అప్పుడు ఉత్తరుడు అలా అని నీకు సైరంధ్రి చెప్పిందా! అని,

Player
>>