ఉత్తరుని భయాందోళనలు1

 ‘అనుచు ధనుస్తూణీర కృపాణ ముద్గరాది వివిధ సాధనంబుల రథంబుపై పదిలంబుగా పెట్టి, నొగలెక్కి పగ్గంబుల స్రుక్కు సక్కన్ జేయ’- రథము సిద్ధము అయింది. అశ్వాలు కట్ట బడినాయి. సారథి కూర్చున్నాడు. రథికుడు- ఉత్తరుడు ఎక్కాడు. ‘ పగ్గంబుల బిగపట్టి’- ఇక పగ్గాలను బిగబట్టి వదిలాడు. అశ్వాలు బయలుదేరుతున్నాయి. రథం వేగంగా వెళుతున్నది. పశువులు ఎటు పోయాయో తెలియాలి కదా! ‘ఉత్తరుండు గోపాలకు నడిగిన’- గవాధ్యక్షుడిని ఎక్కడ ఉన్నాయి అని అడిగాడు. ‘వాడు పితృవనంబువల నని జెప్పిన వినుచు’- ఉత్తరములో ఉన్న శ్మశానభూమినుండి కౌరవులు పశువులను తీసుకుని వెళ్తున్నారు అని చెప్పాడు. ఆ ఉత్తరములో ఉన్న శ్మశానభూమిలో ఏమి ఉన్నాయి? పాండవులు అజ్ఞాతవాసప్రారంభకాలములో తమ ఆయుధాలను నిక్షేపించిన శమీవృక్షము ఉంది. కనుక అర్జునుడికి మరీ సులభము అయింది. తమ ఆయుధాలు అక్కడే ఉన్నాయి. వీళ్ళు వెళ్తున్నది అటే.

ఆ మరుభూమి ప్రాంతానికి చేరుతున్న తరుణంలో ఉత్తరుడికి అల్లంత దూరంలో ఒక మహాజనసంద్రంలా ఉన్న అపారమైన కురుసేన కనపడింది. ఆవులు అంబా అంబా అని అరుస్తూ వెళుతున్నాయి. వాటి వెనుక వెళుతున్న ఆ కురుసైన్యము ఒక అందమైన ఉద్యానవనము స్వర్గానికి వలసపోతున్నదా అన్నట్లుగా ఉంది.

ఇది వ్యాసులవారి అద్భుతమైన వర్ణన. ఆయన అంటారు - ‘తదనీకం మహ త్తేషాం విభౌ సాగరోపమం’ తత్ అనీకం ఆ సేనావాహిని. వాహిని అన్నది కూడా సేనకే అర్థము కదా. వాహిని అంటే సముద్రము. మరి ఇక్కడ అనీకం ఈ అనీకం సేన మహత్, ఎంత గొప్పది అంటే, తేషాం విబభౌ సాగరోపమం’ అది సముద్రముతో ఉపమించే విధంగా ఉన్న మహాసేనాసముద్రము. ఎలా ఉందంటే ‘సర్పమాణ మివాకాశే వనం బహుళ పాదపం’ బహుళ పాదపం - విస్తారమైన వృక్షములతో విస్తరించిన ఒక మహావనము, ఒక అడవి, ‘సర్పమాణ మివాకాశ’-ఆకాశములోనికి చొచ్చుకొని వెళుతున్నదా అన్నట్లుగా ఉన్నది. అంత రభసముతో వెళ్తున్నారు.

ఈ మహాసైన్యాన్ని చూశాడు ఉత్తరుడు. ‘కని ఉత్తరుండుఁ గరుపాఱిన మేనును’- వెంటనే కాళ్ళు చల్లబడ్డాయి. ఏం సైన్యమిది! ఇంతమంది ఉన్నారు. తనా ఒక్కడు. బృహన్నల సారథి. కాళ్లు చేతులు ఆడటం లేదు. ‘లకు మనము’- మనసు చెదరిపోయి, ‘ఱిచ్చబడిన చూపు తొట్రుబడుచు’- చూపు ఆశ్చర్యంతో నిలిచి, మాట తొట్రుబడింది. ‘దిగులుసొచ్చి’- దిగులు పడుతూ ఉత్తరుడు వణుకుతూ బృహన్నలతో అన్నాడు,

శా.        భీష్మ ద్రోణ కృపాది ధన్వి నికరాభీలంబు దుర్యోధన
గ్రీష్మాదిత్య పటుప్రతాప విసరాకీర్ణంబు శస్త్రాస్త్రజా
లోష్మస్ఫార చతుర్విధోజ్వల బలాత్యుగ్రం బుదగ్ర ధ్వజా
ర్చిష్మత్వాకలితంబు సైన్యమిది యే జేరంగ శక్తుండనే.       (విరాట. 4. 52)

Player
>>