ఉత్తరుని సారథ్యం1

కౌరవసైన్యం ఈ రథపుశబ్దం విన్నారు. కలకలం విని  సైన్యమంతా ఒక్క క్షణం ఆగారు. నిలిచి వచ్చేదెవరా అని చూశారు. ఒక రథం తమవైపుకు వస్తున్నట్లుగా కనపడింది. ఇంతలో రథంలో నుండి రథికుడు దూకాడు. సారథి కూడా గుఱ్ఱాలను కట్టేసి దూకి వెనుకకు పరిగెడుతున్న యోధుని వెంట పరుగెడుతున్నాడు. ఎలా పరుగెడుతున్నాడంటే పొడుగాటి కేశములతో, వ్రేలాడుతున్న ఎఱ్ఱని వస్త్రములు గాలికి కదులుతుంటే వెడుతున్నాడు. ‘అజ్ఞులు కొంద ఱప్పు డపహాసము సేయుచు’ ఆ సైన్యంలో అప్పుడు కొందరు ఆ పేడివేషాన్ని చూసి అపహాస్యం చేస్తున్నారు. ‘గూఢరూప రేఖాజ్ఞత లేమిఁ ద ద్వికృత కాయము మీఁదను దృష్ట్లు నిల్పఁగా’ వాళ్ళు అజ్ఞులు కాబట్టి పేడి రూపంలో ఉన్న శరీరాన్నే చూస్తూ పరిహసిస్తున్నారు. అంతర్గతంగా ఉన్న తేజం వాళ్ళకు తెలియటం లేదు.

కానీ ‘ప్రాజ్ఞులు మూర్తి సౌమ్యతయు’ ఆ పరుగెడుతున్న అర్జునుని శరీరంలో ఒక విధమైన సౌమ్యత ఉంది. ఒక విధమైన సమత్వం ఉంది. సౌమ్యమైన భావం ఉంది. ‘బాహుల దీర్ఘతయున్’ చేతులు బాగా విశాలంగా ఉన్నవి. ‘భటత్వ తత్త్వజ్ఞతయున్’ యోధ లక్షణాలు ఉన్నాయి. ‘గతిస్ఫుర దుదాత్తతయుం’ వేగంగా వెళ్ళడంలో ఒక మహాయోధుడో, చక్రవర్తో వెడుతున్నట్లుంది కానీ ఆ సైన్యంలో ఉన్న ప్రాజ్ఞులు అతనిని చూసి ఒక సామాన్యమానవుడు పరుగెడుతున్నట్లుగా లేదు, మూర్తి సౌమ్యత, బాహువుల దీర్ఘత, భటత్వతత్త్వజ్ఞత, గతిస్ఫురదుదాత్తత ఈ నాలుగు గుణాలను చూస్తే పేడిరూపంలోని మహాయోధుడు అని అనుకున్నారు.  ‘ఆఁడు చందంబుఁ బురుష సమాకృతియును’ ఏం వింత? చూస్తే స్త్రీ రూపం, కానీ పురుష సమాకృతి, ‘ఒప్పు నూష్మలత సొంపు’ ఊష్మము అంటే పరాక్రమము, స్త్రీపురుష రూపాలు కలిసి ఉన్నాడు కాని పరాక్రమవంతునివలె అనిపిస్తున్నాడు. ‘వికృత వేషా వృతంబులై వెలయ కితఁడు’ వేషం వికారంగా ఉంది కానీ అసలు విషయం చూస్తే ‘నివుఱు గవిసిన మెఱయని నిప్పువోలె’ బూడిదతో కప్పివేస్తే నిప్పు కనపడకుండా ఉండి, వేలు పెడితే అసలు విషయం తెలిసినట్లుగా ఉంది. ఆ గమనవిధానము, ఆ బాహుచాలనము, శరీర ప్రవర్తనము, ఆ ధాటి, ఠీవి ‘బాహుల చాయయున్, గమనభంగియు నర్జును నట్ల’, చూస్తే అర్జునునివలె ఉన్నాడు.

విశ్వనాథ సత్యనారాయణగారి ‘వేయిపడగలు’ నవలలో ప్రధాన పాత్రధారి, ధర్మారావు దుష్యంతుని గురించి చర్చలో అంటాడు. ‘ఊహచేత దుష్యంతుని భావింపుము. మహాధానుష్కుడు గావున ఆజానుబాహుడై ఉండవలెను. అలాగే ఇక్కడబాహుల చాయయున్, గమనభంగియు’ అర్జునునిలాగానే ఉన్నాయి. సందేహము లేదు. ఇతను అర్జునుడే. ‘ఇతండు తన తేజము డాఁపఁగ మత్స్యభూమి భృద్గేహమునందుఁ బేడి యనఁ గీడ్పడి యుండెనొ?’ తన తేజస్సుని, దాచిపెట్టి పేడివేషంలో విరాటరాజు నగరంలో ఉండి ఉండాలి. ‘కాక యీ కురువ్యూహముతోడి కయ్యమున కొండొకరుం డిటు లొంటి వచ్చునే’? కాకపోతే కురుసైన్యము అని తెలిసి తెలిసి ఒక్కరుగా రావడానికి ఎవరికి ధైర్యం ఉంటుంది? ఎవడు సాహసిస్తాడు? ‘విరటుఁడు దక్షిణంబునకు వీరుల సారథులన్ నిజాజికై పురిఁ గల వారి నెల్లఁ గొనిపోయిన’ దక్షిణం వైపు త్రిగర్తుడిని ఎదుర్కొనడానికి విరాటరాజు సైన్యాన్నంతా తీసుకొనిపోతే ‘నొండులు లేమిఁ జేసి యుత్తరుఁడిట వచ్చుచుండి, యరదంబు దగం గడపంగ నెవ్వరుం దొరకొనకున్నఁ’  ఇంక నగరంలో రథాన్ని నడపడానికి ఎవరూ లేకపోగా ‘తా నితనిఁ దోడ్కొని వచ్చినవాఁడు సూడఁగన్’ ఉత్తరుడు ఇతనిని సారథిగా తీసుకొని వచ్చి ఉంటాడు. ‘అనుచు నిశ్చయరహిత హృదయలగుచుండ’ ఈ విధంగా సందేహం తొలగిన హృదయాలతో కూడుతూ ఉన్నారు.

Player
>>