అర్జునుడి గాండీవ గ్రహణం1

అర్జునుని శమీవృక్ష సందర్శనం

ఇంతలో ఇటు అర్జునుడు ఉత్తరుణ్ణి వెంట తీసుకొని శమీవృక్షం వద్దకు వెళ్ళాడు. అక్కడ శమీవృక్ష సమీపంబున నరదంబున నిలుపం బంచి పార్థుం డుత్తరున కిట్లనియె’శమీవృక్షప్రాంతం చేరి ఉత్తరునితో ఇలా అన్నాడు. ‘ఇన్నగమునందు గాండివ మున్నది’ నగము అంటే పర్వతము. కానీ ఇంకొక అప్రసిద్ధార్థప్రయోగంగా చెప్పిన అర్థం వృక్షం. ‘ఇన్నగమునందు’ అంటే మహాపర్వతంవలె ఉన్న ఈ మహావృక్షంపై గాండీవధనువు ఉన్నది. ఈ గాండీవాన్ని అర్జునుడు పెట్టి వెళ్ళాడు. ‘అది గాని మద్భుజోద్రేక విలా సోన్నతి కోర్వవు ద్దయు నన్నువ లీవిండ్లు కుఱుచ లలఁతి బలంబుల్’ - నీవు రథంలో తెచ్చిన ధనుస్సులు నా సామర్థ్యానికి పనికి రావు. నా సామర్థ్యానికి, ప్రయోగనైపుణ్యానికి ఉపయోగపడేది ఆ గాండీవమొకటే! అది ఈ చెట్టు పైన ఉన్నది.

ఇవి నీ తెగకొలఁదివి’ ఈ రథంలోని ధనుస్సులు నీ బలానికి సరిపోతాయి. కానీ నావంటి వానికి ఇది చాలదు. గాండీవమే కావాలి. ‘వీరవినోదము నప్పు డధిక రభసము లగు మద్వివిధాటోపములకుఁ జాలవు’- యుద్ధం చేస్తున్నప్పుడు నేను ప్రదర్శించే ధనుర్విద్యా కౌశలానికి వలసిన సామర్థ్యం ఈ ధనుస్సులలో లేదు. గాండీవమే కావాలి. కాబట్టి ‘విల్లది’ దాని సామర్థ్యమేమిటి? ‘నూఱువేల లావరయంగన్’- మామూలు ఈ ధనుస్సులు నూఱు వేలు - ఒక లక్ష ఆ గాండీవం ఒక్కదానితో సమానం. కాబట్టి దాన్ని తీసుకురా. ‘వీనిఁగొని గట్టి మైమఱు వేనుంగును మఱియు’ ఇటువంటి ధనస్సులతో గట్టి కవచాన్ని కానీ, ఏనుగును కానీ చీల్చివేయలేము. ‘కావున నిమ్మహీరుహం బెక్కి’ కాబట్టి ఈ చెట్టెక్కి ‘అమ్మహనీయ చాపంబు దెచ్చి యిమ్ము’ ఆ గాండీవాన్ని తీసుకొని రా.  ‘ధర్మజ భీమార్జున నకుల సహదేవులు దమ దమ సమస్తాయుధంబులుఁ గూడంగట్టి యిందుఁ బెట్టిన వారు’ పాండవులు తమ ఆయుధాలను ఇందులో నిక్షేపించారు. ‘ కట్ట విడిచి యందు గాండీవంబు పుచ్చికొని తక్కటియవి యెప్పటియట్ల బంధింపుము’ ఆ కట్టను విప్పి గాండీవధనువును తీసికొని మిగిలినవి అలాగే కట్టివేయి.

ఉత్తరుడు చూసేసరికి ఆ శమీవృక్షం పై ఒక శవాకారం కనిపించింది. మూలంలో  వ్యాసులవారు సుస్పష్టంగా పాండవులు ఒక శవాన్ని కూడా ఆయుధాలమూటతో కలిపి కట్టి శమీవృక్షంపై నిక్షేపించారని చెప్పారు. అందువల్ల సంవత్సర కాలం గడిచాక ఆ శవం కుళ్ళిపోయి అస్థిపంజరం బయటపడి ఉండవచ్చు. కానీ వీరు కట్ట కట్టిన మూట శవాకారంలోనే ఉంది కాబట్టి ఉత్తరుడు చూసి, ‘ఏమిటి గాండీవమంటున్నావు? పాండవులు ఆయుధాలు పెట్టారంటున్నావు? నాకసలేమీ అర్థం కావటంలేదు. అయినా పైన చూస్తే ఒక వస్త్రంలో శవాన్ని కట్టినట్లుగా ఉంది. ‘పీనుఁగు నంటఁగ దగునే భూనాథ తనూజుఁ డనక, పుయిలోడక’ నన్ను శవాన్ని తాకమంటున్నావే! ‘పనుపం గా నీకుం దగునె’? ఏమయ్యా! యుద్ధంలో నుండి పారిపోతున్న నా భీతిని చూసి ఈ పాపకర్మను చేయిస్తూ నన్ను పరిహాసం చేయవచ్చా?’ అని అడిగాడు.

అర్జునుడు అన్నాడు, ‘మనుజులంటకుండ మఱువడఁ జేసిన యస్త్ర శస్త్ర సంచయంబు గాని, శవము గాదు’ మనుషులకు ఈ ఆయుధాలు కనపడకుండా ఉండాలనే ఆలోచనతో వాళ్ళు దీన్ని ఇలా కట్టిపెట్టారు కానీ ఇది నిజానికి శవము కాదు. ‘మత్స్య జన పాలతనయ’ ఓ రాజకుమారా! ‘సుక్షత్రియ వంశ సంజాతుడనైన నిన్ను’ ‘అట్టిదైనఁ బనుతునయ్య నిన్ను’ అది శవమే అయితే నిన్ను పంపిస్తానా ? ఆ మాత్రం విచక్షణ లేదా నాకు? అది శవం కాదు. ఆయుధాలే. ‘నమ్ముము కైదువు మోపగు జమ్మి వెసం బ్రాఁకి విడిచి చాపము నాకందిమ్ము’ నువ్వు చెట్టు ఎక్కి మూట విప్పు. అక్కడున్న గాండీవాన్ని జారవిడుచు. ‘అనుడుఁ జేయునది లే కమ్ముగ్ధుం డమ్మహీజ మలసత నెక్కెన్’ అర్జునుడు ఇలా నచ్చచెప్పేసరికి ఇక తప్పక ఉత్తరుడు మెల్లగా శమీవృక్షంపైకి ఎక్కాడు. ‘ఇట్లుత్తరుండు సమారూఢ శమీవృక్షం డగుటయు, నరదంబు పయి నిలుచుండి పాండవ మధ్యముండు’ రథంపైనుంచీ  అర్జునుడు ఎక్కి బాహువులు చాచి ఇంక వదులు, వదులు అంటున్నాడు. అప్పుడు ఉత్తరుడు మూట విప్పగా ‘మెఱసి యుదయించు గ్రహముల తఱచు ప్రభలఁ గ్రేణిసేసి దశదిశలం గ్రిక్కిఱిసి వెడలె నా విండ్లన్ మెఱుఁగులు’ ఆ మూటలో కట్టిపెట్టిన ఆ గాండీవం బయటపడి వస్తుంటే గాండీవధనుస్సునందు నిక్షేపించిన మరకత మాణిక్యరత్నమణిమయ కాంతులతో దశ దిశలు కాంతిమంతములై తళుక్కుమన్నాయి.

Player
>>