అర్జునుడి శాప విముక్తి1

బృహన్నలే అర్జునుడన్న విషయం ఉత్తరకుమారుడికి నమ్మశక్యం కాలేదు. తన గురించి తానే పరిచయం చేసుకున్నాడు అర్జునుడు. విరాటరాజు కొలువులో తమ అన్నదమ్ములు ఎవరెవరు ఏ ఏ నామధేయాలతో ఏ ఏ వృత్తులను ఆశ్రయించుకుని ఉన్నారో అంతా వివరంగా చెప్పాడు. చెప్పినప్పటికీ ‘నీవు అర్జునుడివే అయితే అర్జునుడి పది పేర్లు చెప్ప’ మని అడిగాడు ఉత్తరుడు. అంతే కాదు, ఒక్కసారి బృహన్నలే అర్జునుడు అని తెలిసేసరికి తను అన్న మాటలే తనకు గుర్తుకు వచ్చాయి. ‘నాకు అర్జునుడే ఆదర్శం, పార్థుడిలా యుద్ధం చేస్తాను, నన్ను చూసి అర్జునుడే యుద్ధం చేస్తున్నాడని ద్రోణాచార్యుడు, కృపుడు, అశ్వత్థామ, భీష్ముడు మురిసిపోయేలా చేస్తాను’ అని చెప్పుకున్నాడు కదా! అటువంటి అర్జునుడే తనకు రథసారథ్యం వహించడం, రథం దిగి పారిపోతుంటే వెనుకకు తీసుకు రావడం, ఇవన్నీ ఏదో ఒక కలలా అనిపిస్తోంది.

అర్జునుని పది పేర్లు

అర్జునుని దశనామాలలో ఒక్క పేరు విషయంలో తప్ప మిగతా అన్ని చోట్లా సంస్కృత భారతానికి తెలుగు భారతానికి సామ్యాన్ని చూసుకున్నాము. అర్జునుడు అంటే ప్రసిద్ధంగా కనపడే శ్లోకంలో ‘అర్జునః ఫల్గునః పార్థః కిరీటిః శ్వేతవాహనః బీభత్సః విజయో ధనుంజయః సవ్యసాచి కృష్ణః’ వీటిల్లో కృష్ణ అనే శబ్దం ఉంటుంది. అదే జిష్ణుడు. ఒక అక్షరం భేదంగా కనిపిస్తుంది. తిక్కన రచనలో ఉత్తరుడు, ‘చిరకీర్తి ప్రియుఁడగు నన్నరునకుఁ బది గలవు భవ్య నామములు’ అర్జునునకు పది పేర్లు ఉన్నాయని విన్నాను. ‘మనోహరముగ’ మనస్సును హరించే విధంగా, పేర్లను వింటే మనసు హరించుకుని పోతుందా? రూపంతో మనస్సు హరిస్తుంది. మనోహారిణి అనే మాట విన్నాము కాని ఉత్తరుడు నీవు చెప్తేనే మనోహరం అంటున్నాడు. ఎందుకంటే, ఇక్కడ అర్జునుడు అర్జునుని రూపంలో లేడు. బృహన్నల రూపంలో ఉన్నాడు. ఆ పేర్లని అన్వయించుకు చూస్తే మనసు హరించుకుని పోవాలి. ‘మనోహరముగ నవి సెపుమా యొండరయక యే నమ్మెదను బృహన్నల! నిన్నున్’ అవి చెప్పావంటే నాకు నమ్మకం కుదురుతుంది అన్నాడు.

ఉత్తరుడు చాలా గడుసువాడు. అమాయకంగా కనిపిస్తున్నా అవసరమైనప్పుడు తన గడుసుతనాన్ని ప్రదర్శిస్తున్నాడు. గడుసుతనం చూపి నమ్మకం కుదుర్చుకోవటం ఎందుకు? ఇప్పుడు బృహన్నల ఏం చెప్పినా వినకుండా తనను యుద్ధభూమికి తీసుకొని పోయే ప్రయత్నంలో ఉన్నాడు. ఇతడిని ఎదుర్కొనే సాహసం, బలం, ధైర్యం ఏవీ తనకు లేవు. కాబట్టి ఇతను అర్జునుడే అని దృఢపరుచుకుంటే తనకు క్షేమం. కొంచెం మనసు చెదరకుండా ఉంటుంది. అందుకని నీవు చెపితే నమ్ముతాను చెప్పు అన్నాడు. ‘అనుటయు నతండు సస్మితాననుండగుచునర్జునుండు, ఫల్గునుండు, పార్థుండు, కిరీటి, శ్వేతవాహనుండు, బీభత్సుండు, విజయుండు, జిష్ణుండు, సవ్యసాచి, ధనంజయుడు నను నివి పదియును నా పేళ్ళనవుడు, నుత్తురుండు పాండవమధ్యమున కిట్లనియె. ‘ఓహో! ఇవా నీ పది పేర్లు, ఇవి నేను కూడా విన్నాను. నిజమే!’

అయితే, ‘ఏమి కతంబున నిట్లీ నామంబులు సంభవిల్లె నరునకు?’ ‘నీకు అని అడగలేదు. ఆ నరునికి - ఆ అర్జునునికి ఈ పది పేర్లు ఎలా వచ్చాయో అది చెప్పు’ అన్నాడు. ‘అవి చేతో మోదంబుగఁ జెప్పుము’ అక్కడ ‘మనోహరముగ’ ఇక్కడ ‘చేతోమోదంబు గ’ చెప్పు. ఎలా?నీమది తత్తద్విధంబు నిశ్చితమేనిన్’ ‘నీకు బాగా తెలిసి ఉంటే చెప్పు’ అన్నాడు. అర్జునుడికి తెలియకుండా ఎందుకు ఉంటుంది? ‘అనుటయునట్ల చేయుదునని యతం డిట్లనియె’.

Player
>>