బృహన్నలే అర్జునుడు!1

ఉత్తరునికి నమ్మకం పుట్టించి, ధైర్యం కలిగించటానికి తన విజయాలను గురించి చెప్పుకుంటున్నాడు అర్జునుడు. ‘పదంపడి గీర్వాణులకు నోర్వరాని యట్టివారి, వరదాన గర్వితుల నివాతకవచు లనియెడు దైతేయుల మాతలి సారథికంబగు నైంద్రస్యందనం బెక్కి యొక్కండన మూఁడు కోట్ల నిర్జించితిని’ – ‘ఉత్తర కుమారా! నేను ఇంద్రుని రథంమీద మాతలిని రథసారథిగా చేసుకుని దేవతలకు కూడా సంహరించడానికి సాధ్యపడని నివాత కవచులనే రాక్షసులతోపాటు, మూడుకోట్లమందిని ఒంటరిగా యుద్ధం చేసి సంహరించాను. ‘హిరణ్యపుర నివాసుల నఱువదివేవుర దేవారాతుల వారాశి తీరంబునం బరిమార్చితిని’ - ఇంకా హిరణ్యపురనివాసులు కాలకేయులను మట్టు పెట్టాను. ‘అప్పుడు ప్రీతుండై కదా గిరిభేది కిరీటం బొసఁగె’ - అప్పుడు ఇంద్రుడు నాకు కిరీటం ఇచ్చాడు. ‘దేవసంఘంబు శంఖం బిచ్చె’ దేవతలందరూ ఒక శంఖాన్ని బహుమానంగా ఇచ్చారు. శత్రువుల మనస్సులో ఆ శంఖనాదం భయము కలిగిస్తే, స్వసేనలో ఉత్సాహము కలిగిస్తుంది. దేవతల చేత ఇవ్వబడింది కాబట్టి ఆ శంఖానికి  దేవదత్తం అనే పేరు వచ్చింది. ‘మఱియు నెయ్యెడల నెవ్వరు దొడరినం బొలివోని బలిమి కలిమి వెలుంగుదు’ – నువ్వు అనుమానించవలసిన అవసరం లేదు. ఎవ్వరూ ఊహించలేని శక్తిసామర్థ్యాలు కలవాడిని! ‘గాంధారీనందనుండు గంధర్వరాజు చేతం బట్టువడిన యప్పుడు పదునాలుగువేల గంధర్వుల జయించి యతని విడిపించితిని’ దుర్యోధనుడు చిత్రసేనుని చేతిలో బందీగా ఉన్నప్పుడు పదునాలుగువేలమంది గంధర్వులను జయించి దుర్యోధనునికి విముక్తి కలిగింపజేశాను. ‘నీవోడకుము’ - నీకే భయమూ అక్కరలేదు.

              ‘ఈ కూడిన కురు బలంబుల గెలిచి’ – ఇక్కడ చేరిన కురుబలాలను గెలిచి, ‘కర్ణ, గాంగేయ, కృప, ద్రోణ, ద్రౌణి, దుర్యోధను లు కనుంగొనుచుండఁ గదుపులం గ్రమ్మఱించెదను’ - వీళ్ళందరూ చూస్తుండగానే మనం ఆవులను విడిపించుకుని పోదాము. ‘అని సత్వరంబుగాఁ జెప్పిన, విని యుత్తరుండు చిత్తంబున నద్భుతహర్షంబులు వొడువ’ – అని చెప్పేసరికి ఉత్తరుడు ఆనందాశ్చర్యాలకు గురయ్యాడు. ‘మ్రాను డిగ్గనుఱికి’ ఉత్తరుడు చెట్టుపైన కూర్చుని ఈ ప్రశ్నలన్నీ అడిగి తెలుసుకొని గాండీవాన్ని పైనుండి జారవిడిచి అందించాడు. ఇతను అర్జునుడు కాదేమోనన్న భయంతో అంతవరకు పైనే కూర్చున్నాడు. ఆర్జునుడే అని నిశ్చయించుకున్న వాడై చెట్టు దిగి,  సర్వాంగ సంగ తోర్వీ తలంబగు దండప్రణామం బాచరించి- అర్జునునికి సాష్టాంగ నమస్కారం చేశాడు.

 

అర్జునుడని తెలిసేసరికి ఉత్సాహంతో పొంగిపోయాడు. ఇంత వరకు ఉత్తరుడు ప్రవర్తించిన తీరువేరు. అక్కడ ప్రగల్భాలు పలికినప్పుడు అమాయకుడు, యుద్ధభూమికి వచ్చినప్పుడు భయస్తుడు. ప్రస్తుతం అప్పుడప్పుడే క్రమ వికాసం కలుగుతున్న బుద్ధిమంతుడైనాడు. అర్జునుడిగురించి తెలుసుకున్న తరువాత ఉత్తరునికి బుద్ధి వికసించింది. అర్జునుని చెంత నిలిచేటప్పటికి తాను చదువుకొన్న రాజనీతిలక్షణాలన్నీ ప్రస్ఫుటించాయి. ‘దండప్రణామం బాచరించి చేతులు మొగిచి నిలిచి యిట్లనియె’ - చేతులు కట్టుకుని ఇలా అన్నాడు.  బాహు సమగ్ర శత్రు మదభంజన శౌర్య అన్నాడు. ఇక్కడ అద్భుతమైన పద్యం వ్రాశారు తిక్కనగారు. విశ్లేషించి చూస్తే దీనిలో సాహిత్యలక్షణాలన్నిటికి ప్రతీకలైనట్టి కావ్యగుణాలన్నిటినీ నిక్షేపించి వ్రాసిన పద్యమిది.

Player
>>