దేవదత్తపూరణం1

అర్జున సాక్షాత్కారం......

అర్జునుడు తన పూర్వపు స్వరూపంతో గాండీవాన్ని చేపట్టేసరికి పౌరుషం వచ్చింది. పురుషత్వానికి ఒక విధమైన ప్రామాణికను నిర్దేశించే విధంగా అర్జునుడు తేజోవంతుడై నిలిచాడు. వెంట్రుకలు విడదీసుకున్నాడు. అంతవరకు నర్తనశాలకు అనుగుణంగా ముడుచుకున్న కేశాలను పురుషోచితప్రకారంగా అమర్చుకున్నాడు.

తిక్కన గారి ప్రయోగం ‘తలచుట్టు చుట్టె- తల చుట్టు అంటే తలను చుట్టుకుని ఉండేది - తలపాగ, తలపాగాని తీసి చుట్టుకున్నాడు. కిరీటం పెట్టుకునేటప్పుడు, ఒరిపిడి లేకుండా తలపై ఆచ్ఛాదన చేసుకుంటారు. ‘తలచుట్టు చుట్టె ముందు ద్రిండు గాఢముగఁ గట్టె కరంబుల వలయంబులు గనుఁగొని యెల నవ్వొలయంగ – చేతులకు శంఖవలయాలు ఉన్నాయి. వాటిని చూసుకుని నవ్వుకున్నాడు. పోనీ ఉండనీ అనుకుని రథాన్ని ఎక్కాడు.

అజ్ఞాతవాస సమయం అయిపోయింది. శాపవిమోచనం కలిగింది. ఇప్పుడు పార్థుడి చండప్రచండమైన పరాక్రమాన్ని చూపించాల్సిన సమయం ఆసన్నమయింది.

పెట్టక కట్టక మౌళిం బుట్టిన క్రియ దీధితులు నభోభాగంబున్ ముట్టి వెలుంగగ'- ఆకాశంలో ప్రకాశవంతమైన కిరణాలు నింపుతూ కిరీటం స్ఫురించింది. ‘ఇవ్విధంబున సన్నద్ధుండై యతిరథశ్రేష్టుండు రథం బెక్కి యం దాయుధంబులు పదిలంబుగా నిడి తనుత్రాణ తలత్రాణంబులు తాల్చి కవదొనలం బూని, గాండీవంబుఁ బుచ్చికొని యెక్కువెట్టి ముష్టి నలవరించి గుణధ్వని సేసిన’- కవచము, తల త్రాణము. రెండు తూణీరాలు జంటలను పూని, గాండీవాన్ని తీసి, నారి సారించి గుణధ్వని చేశాడు. ఆ గుణధ్వని వేగంతో ఝంకార నాదం దావానలంలా వ్యాపించింది.

తదనంతరంబ యగ్నిదేవుం దలంచిన నతండును దన వరంబున మున్న కలిగి విశ్వకర్మనిర్మితంబును మాయా మయంబును, వానరాకారంబునునగు మహోగ్ర కేతనంబును తదాశ్రితంబులైన వికృతాభీల నానావిధ భూతంబులఁ బుత్తెంచిన’- అగ్నిదేవుని దగ్గర దాచి పెట్టుకున్న కపి కేతనము వచ్చి అర్జునుని చేరింది. ‘ఉదాత్తచిత్తుండయి యుత్తరు సింహపతాక శమీవృక్షంబున బెట్టించి నిజధ్వజంబు రథంబునం గట్టించి’- ఉత్తరుని పతాకంతో పనిలేదు కనుక ఉత్తరుని సింహకేతనం శమీవృక్షంపై పెట్టించాడు.  తన  కపికేతనాన్ని రథానికి  కట్టించాడు. ‘దివ్యంబు కావున దేవదత్తంబు చిత్తజ్ఞత్వంబున సన్నిధి సేసిన’ అర్జునుని మనసెరిగి దివ్యమైన దేవదత్తం వచ్చింది. దానిని ‘సవినయంబుగా గైకొనియె నక్కుమారుండు నాయితం బై నొగలెక్కి పగ్గంబు లమర్చికొని యగ్గలికంతోడం తురంగంబుల యంగంబులు తొడయుచు వాని జవసత్వంబులు వేఱవేఱ వర్ణించిన’ దానిని వినయంగా స్వీకరించాడు. ఉత్తరుడు నొగలు ఎక్కి, పగ్గములు పట్టి, ఆ గుఱ్ఱాలను నిమురుతూ వాటి వేగాన్ని వేరువేరుగా వర్ణించాడు. అర్జునుడు కిరీటధారియై, ధనుస్సు ధరించి రథాన్ని ఎక్కాడు.

Player
>>