దుర్యోధనుని అధిక్షేపణ1

దుర్యోధనాహంకృతి

దుర్యోధనుడు ద్రోణుడు చెప్పినది విన్నాడు. అతనికి ఆ ప్రణాళిక ఎంత మాత్రం నచ్చలేదు. ‘అనిన విని సుయోధనుడు భీష్మ కృప కర్ణ వికర్ణులదెసం గనుంగొని’ అందరి వైపు చూసి, ‘మున్నచెప్పితిన కాదె’ ఇంతకు ముందు ఒకసారి చెప్పాను కదా! వచ్చేవాడు అర్జునుడు అయితే అజ్ఞాతవాస సమయభంగం అయినట్లే. కనుక మళ్ళీ పన్నేండేళ్ళు అరణ్యవాసము, ఒక ఏడాది అజ్ఞాతవాసం చేయడానికి పంపిస్తాం. ‘చెప్పితిన కాదె జూదంబునం బరాజయం బొంది పాండునందనులు పండ్రెండువత్సరంబులు వనంబున వసియింపను బదుమూఁడగు నేఁడు జనపదంబున మన మెఱుంగకుండఁ జరియింపనుం బూని కాదె భూమి వెలువడిరి’ వాళ్ళు సమయాన్ని గుర్తించక తమను తాము బయల్పరుచుకుంటున్నారు. ఇది ముందే చెప్పాను కదా. అవివేకంతో అర్జునుని ప్రశంసించవలసిన అవసరం ఏమున్నది?

‘ఈ పదమూఁడవ యేఁటి కొఱంత గలుగం బార్థుండు దన్నెఱిగించి కొనియె’ ఇంకా పదమూడవ సంవత్సరం కొరత ఉన్నది. పూర్తి కాలేదు. ‘దానిలో బార్థుండు దన్నెఱిగించి కొనియె’ ఇప్పుడు ఆ కిరీటి అలా వస్తే నాకు ఎంతో ఆనందం! ఎందుకంటే ‘నెప్పటి యట్ల వనవాసంబునకుం జనవలయు’ మళ్ళీ వనవాసానికి వెళ్ళవలసిందే. ‘మోహంబునం గానమి నొండె’ మోహంతో ఈ యథార్థాన్ని మనం గుర్తించటంలేదు. అర్జునుని మీద నీకు ఉన్న శిష్యవాత్సల్యం వల్ల కంటికి మోహము అనే తెర పడిపోయింది. ‘వారు లోభంబున వచ్చుట నొండె’ వాళ్ళు లోభంతో తమ అజ్ఞాతవాసం అయిపోయింది అనే ఉత్సాహంతో బయల్పడుతున్నారు. ఇంకా సమయం కాలేదు. ‘కావున నెక్కువ దక్కువలు నిరూపించి’ వాళ్ళ సమయం ముగిసిందా లేదా వాళ్ళ ప్రతిజ్ఞలు చెల్లించుకున్నారా? పదమూడుసంవత్సరాలు అయిపోయాయా లేదా? ‘ఎక్కువ దక్కువలు నిరూపించి భీష్ములు దీని నిశ్చయింప నర్హులు’ అనే విషయాలను భీష్మాచార్యులవారు దీనిని నిర్ణయిస్తారు. ‘రిత్త యుత్తరుండు కాక గాండీవియు నగుట మన కార్యంబు సఫలంబు’ నీ శిష్యుని గొప్పతనాన్ని నువ్వు చెప్పుకుంటూ ఉండవచ్చు. కానీ ఆయనకు విషయం తెలుసు కాబట్టి ఆయనను చెప్పనీ.

‘సుశర్మ నక్కడ గోవులం బట్టం బనిచి మత్స్యనగరంబునం గౌంతేయులున్న వారని శంకించి వారల గూయి వచ్చినం గనుటకుం గాదె’ సుశర్మని ముందు పంపి అక్కడ దక్షిణగోగ్రహణం చేయమని పంపినది ఎందుకు? విరాటరాజు తన సైన్యాన్నంతా తీసుకుని అక్కడ సుశర్మ గ్రహించిన గోవులను రక్షించుకోవటానికి వెళితే, మనం ఈ వైపు రెండవ రోజే ముట్టడి చేస్తే ఇంక నగరంలో ఎవ్వరూ లేక పాండవులే వస్తారు అని కదా! ‘విచారం బేల యని పలికి వెండియు నిట్లనియె’ కాబట్టి అర్జునుడు ఒక్కడే వస్తున్నాడంటే ఇప్పుడు ఆలోచించవలసిన పనేమిటి? మనం అనుకున్న విషయమే కదా.

‘అర్జునుఁడైన నేమి’ అయినా అర్జునుడైతే మాత్రం ఏమి? ‘సురలైనను నేమగు’ ఆ దేవతలైతే కూడా ఏమౌతుంది? ‘విద్విషచ్ఛిదోపార్జితమైన గోధనము బట్టితి మెవ్వరు వచ్చి రేని విస్ఫూరిత బాహుసంపదలు సూవుద మొండొరు మీఱి నిర్మలాత్యూర్జిత కీర్తి కారణ రణోద్ధతి వెల్వెలఁబాఱ నేటికిన్’ ఇంతమంది పరాక్రమవంతులం, శౌర్యవంతులం ఉన్నాం. అర్జునుడికి విల్లు పట్టుకోవడం దగ్గరినుంచి ధనుర్విద్య నేర్పించింది మీరు. భీష్మాచార్యులు, కృపాచార్యులు, అశ్వత్థామ, కర్ణుడు ఇంతమంది ఉండగా అర్జునుడు ఒక్కడే వచ్చాడు.

Player
>>