కర్ణుని అధిక్షేపణ1

కర్ణుని క్రోధం

అనిన విని రాధేయుండు సక్రోధుండై యోధ వీరలోకంబు రాధేయుడికి కోపం వచ్చింది. ద్రోణుడు అంతలేసి మాటలన్నాడు. వెంటనే ద్రోణుడికొడుకు రాజును - దుర్యోధనుడిని పట్టుకుని ఇంత మాట అంటాడా? ఎంత పొగరు!

వడిగొని గోగణంబు బొదువం బఱతెంచితి రెల్లవారు మున్నొడఁబడి దక్షిణంవైపు నుంచి సుశర్మ గోగణాలను తీసుకుని వస్తే ఉత్తరంవైపు మనం ముట్టడించాలని నిశ్చయించినపుడు ఒక్కడు కూడా జవాబు చెప్పలేదు. దానికి అందరూ ఒప్పుకుని పాండునందనుల యున్నెడ యిమ్మెయిఁ గాన వేఁడి ఇప్పుడు నరుగాంచి ఈ రోజు అర్జునుడిని చూసి, వచ్చినమాట మరచిపోయి ‘అతని పోటు నుతించుచు భీతి నిట్లు వావిడిచి యనేకభంగిఁ బృథివీపతి వీఱిఁడిఁ జేయు టొప్పునే’ ఇప్పుడు అతని పరాక్రమాన్ని స్తుతిస్తూ ఇలా మాట్లాడుతున్నారు మీరు. ఆ రోజు నిర్ణయించుకొనే వచ్చాం కదా! తలలూపారు కదా! వెళదామన్నారు కదా! అప్పుడు నిశ్చయించుకుని వచ్చి ఇప్పుడీ విధంగా చేయడం ఎందుకు ?

‘వెఱచితిరేని’ మీకంత భయంగా ఉంటే నిలబడండి. యుద్ధం చేయనక్కరలేదు. ‘ఒక వీరున కొక్కఁడ చాలుఁగాక’ ఒక వీరునకు ఒక్కడే చాలు. ‘ఎందఱు వలయుం’ అర్జునుడు ఒక్కడే వస్తున్నాడు. అర్జునుడిని ఎదుర్కోవటానికి ఒక్కవీరుడు చాలు. ‘ఎందఱు వలయుం’ ఎందుకీ సైన్యమంతా? అనవసరం. ‘కపిధ్వజము దవ్వుల వ్రేల్మిడిఁ ద్రుంచి వైచెదం బఱపెదఁ దత్పిశాచముల భగ్నము సేసెదఁ దేరు సారథి న్నెఱఁకులు నొంచెదం బొదులు నించెద నర్జును గాత్రశాలలోన్’ నేను చాలు మీరెవ్వరూ అక్కర్లేదు.

 ‘జ్యాఘోషం బతిభీషణంబయి’ మనం వెనుక చెప్పుకున్న సాహిత్యశాస్త్రం నిర్దేశించిన పది కావ్యగుణాలు స్మరణకు రావాలి. ఎక్కడ ఓజోగుణం ఉంది? ఎక్కడ ప్రసాదగుణం ఉంది? ఎక్కడ మాధుర్యం ఉంది? ఎక్కడ సమత ఉంది? గుర్తుకు వస్తూనే ఉండాలి. రణరంగవిజృంభణవర్ణనాత్మకమైన ఈ పద్యం ఓజోగుణసంపన్నమై తదనుగుణ పదప్రయోగంతోనే నిర్మింపబడింది.  ‘జ్యాఘోషం బతిభీషణంబయి దిశాచక్రంబు నిండన్ శరవ్యాఘాతంబున శాత్రవుండు వికలస్వాంతుండుగా నారద శ్లాఘాపాత్రమునై యనర్గళ భుజాసంరంభతన్ రౌద్ర రేఖా ఘోరాకృతి యేన చూపెద’ నేను చూపిస్తాను. ‘అశంకం జూడుఁడీ యేర్పడన్’ ఏ సందేహం లేకుండా నా పరాక్రమాన్ని చూడండి.

 ‘క్రోధజ్వాలలు నిగుడ విరోధి బలేంధనముఁ బొదువు క్రూరతమై దుస్సాధ మగు నర్జునాగ్నిని’ సాధించడానికి వీలులేని అర్జునుని ప్రతాపాగ్నిని నా ‘శరవర్షమునన్ నా బాణాలవర్షముతో నేను శాంతింపజేస్తాను. శరము అనే పదానికి శ్లేషతో సాధించిన అర్థము ఇది. ‘ప్రతాపాగ్నిని బాణ వర్షముతో శాంతింపజేస్తాను’ అన్నాడు.

 ‘పాండవమధ్యముండు పదుమూఁడు వత్సరంబులు పూఁచిపట్టి’ పదమూడు సంవత్సరాలు అణిచిపెట్టుకున్న పరాక్రమంతో ‘కయ్యంబునకు వచ్చె నతని లావును బీరంబును లోకంబునకు నెక్కి యున్నయవి యేనును గురుసేనయందు శక్తి శౌర్యంబులు గలవాఁ డనపోలె వర్తించెదం’ అర్జునుడు సమరానికి వస్తున్నాడు. నేను కూడా కురుసేనలో పరాక్రమవంతుడననే పేరు తెచ్చుకున్నవాడినే! ‘కావున నేమిరువురము నొండొరులకు బాహుబలవిలాసంబును విక్రమక్రీడాకౌశలంబును బ్రకటించుట యుచి తంబు గాదె యని వెండియు నిట్లనియె.’

మీరంతా మన ప్రభువు దుర్యోధనునిపై ఆధారపడి బ్రతుకు తున్నారు. ఇప్పుడు అవసరమైనపుడు ఆయనపై కృతజ్ఞత లేక ఈ విధంగా మాట్లాడతారా! ‘అనుదినంబును నంతకంతకుఁ బెరిఁగెడి యధిపతి మన్నన యప్పుదీర్ప’ ‘అర్జును నోర్చెద ననిలోన నేనని యతనితోఁ బలికిన ప్రతిన నెఱపఁ’ అర్జునుని గెలుస్తాను అని అతనికి ఇచ్చిన మాట నిలుపుకోవడానికి, ‘కర్ణార్జునులయందు ఘనుఁ డెవ్వఁ డగునొక్కొ యను జనంబుల సందియంబు మాన్ప’ విలువిద్యలో అధికుడు కర్ణుడా? అర్జునుడా? అనే సంశయం ఈ నాటితో తీరిపోటానికి, ‘జమదగ్నిసుత కృపాశ్రయమునఁ బడసిన విలువిద్యకల రూపువెలయఁ జేయఁ’ ఆ రోజు పరశురాముడి దయతో సాధించిన విలువిద్యలో ప్రావీణ్యతకు సార్థకత నెలకొల్పటానికి ‘కనుట నేఁడు పుణ్యదినమయ్యె’ ఈ అవకాశం దొరకడం నాకు చాలా సంతోషకరం. నేడెంతో సుదినం! ‘మీ కెల్లఁ బోరు సూడ నిష్ట మేనిఁ జూడుఁడ’. మీరు నా యుద్ధాన్ని చూడాలనుకుంటే చూడండి. ‘అట్లుగాక వేడుక లేదేని సంతసంబునఁ బసుల జాడఁ బొండు’ లేకపోతే పశువులు వెళుతున్న దారినే అనుసరించండి.

Player
>>