అజ్ఞాతవాసకాల నిష్కర్ష1

యుద్ధసిద్ధత

             ద్రోణులవారి వ్యూహరచన చాలా అద్భుతమైనది. ముందుగా ఒక నాలుగవ భాగం సైన్యంతో దుర్యోధనుడు వెళ్ళిపోవాలి. తరువాత పశువులు, వాటి వెనుక మరొక నాలుగో వంతు సైన్యం. తరువాత మిగతా వాళ్ళందరూ మెల్లిగా ఆ పశువుల వెనక వెళ్లాలి. ‘ఆచార్యుండు నడుమను’ చతురంగబలాన్నంతా ఒక విధంగా నిలిపి మధ్యలో ద్రోణాచార్యులను పెట్టాడు. ‘కృపాచార్యుండు వలపటను సైన్యానికి కుడివైపున కృపాచార్యుడు, ‘ఆచార్యపుత్రుండు దాపటం’ ఎడమవైపున అశ్వత్థామ, ‘కర్ణుండు ముందట’ ముందు కర్ణుడు, వెనుక భీష్ముడు. అంటే ఇంతమంది సైన్యాన్ని కాపాడుతూ, అర్జునుడు వస్తే ఎదుర్కోవడానికి భీష్మాచార్యులు నిలబడ్దారు. ఆయనను పాండవపక్షపాతి అని ఎలా అంటాము? ‘వికర్ణ దుశ్సాశన శకుని సైంధవ సోమదత్త బాహ్లిక భూరిశ్రవః ప్రభృతి యోధ వీరులెల్ల నెడనెడం గలయ- అక్కడక్కడ వాళ్ళనందరిని నిర్దేశించి, మోహరించి, ‘మహోత్సాహంబున సన్నాహ సౌందర్యంబు నొంది తాలధ్వజం బెత్తించి మెరసి తాను వెనకయయి నడపించుచుండె’- అందరికన్నా వెనుక ఆయన నిలబడ్డాడు.

అర్జునుడు వస్తే మొట్టమొదట చూసేది భీష్మాచార్యుడినే. ఇంతమందిని కాపాడే భారం పితామహులు, కురువృద్ధుడు భీష్మాచార్యుడు తీసుకున్నాడు. ‘అట్టి సమయంబున’,

దేవతల యుద్ధ దర్శనోత్సాహం.....

‘అరుదుగ నిట్టు లొక్కనికి అంత బలంబునకున్ మహోగ్ర సంగర మగుడున్’- ఒక్కనికి అంత సైన్యంతో అరుదుగా సంభవించేటువంటి ఇటువంటి యుద్ధాన్ని చూడటానికి సురగణమంతా తరలి వచ్చారు. ‘సంగరమగుడున్ మనం బతులకౌతుక మొంది కనుంగొనన్ సురేశ్వరుఁడు సుదర్శనంబన ప్రశంసకు నెక్కు విమానమెక్కి- ఆ దేవతలరాజుకు ఎన్నో విమానాలు. దానిలో సుదర్శనమనే విమానం ఎక్కి వచ్చాడు. ‘అంబరగతి వచ్చె దేవమునిపంక్తులు సిద్ధగణంబు గొల్వగన్- ఆ ఇంద్రునితో సకల దేవతలు, మునులు కూడా ఉన్నారు. ‘పాండుమహీపాలుం డాఖండలు చేరువన పెద్దగద్దియ’- వీళ్ళు ఎలా యుద్ధం చేస్తారో చూడాలని వచ్చి ఇంద్రుడి పక్కనే కూర్చున్నాడు పాండురాజు. మహాయుద్ధాలు చేసి ఈ సామ్రాజ్యాన్నంతా సంపాదించినది అతడే కదా! కాబట్టి అంతటి పరాక్రమవంతుడైన ఆ పాండురాజు, ఈ రోజు తన పుత్రుడు అర్జునుడు ఇంతమందితో ఎలా యుద్ధం చేస్తాడో చూడాలని వచ్చాడు. ‘అమరీ మండలి వీచోపు లిడఁగ’- వీచోపు లిడగ- దేవకాంతలు వింజామరలు వీస్తుండగా నుండి కనుంగొనుచు నుండె నుజ్జ్వల భంగిన్ ఆయన చూస్తుంటే అర్జునుడు రణోచితములైన సకలాలంకారాలతో, దేవతలు ప్రసాదించిన కిరీటము ధరించి వచ్చాడు. అర్జునుడి స్వయం స్వరూపము ప్రతిభాసితం అవుతున్నది.  

Player
>>