యుద్ధారంభం1

‘అని పలికి బలంబుఁ బురికొల్పికొని యతండు రాజరక్షణ తత్పరత్వంబున నరదంబు సత్వరంబు సేసిన, సేనాపతిం గని సైనికనికాయంబులుం గడంగి చనందొడంగె; నిప్పాట సమ్మేటిమొనయును వెసం బోవ గోవుల కావలి మూకఁయు వానిం దఱిమికొని యతిరయంబున నరుఁగ’- ఇలా భీష్ముని చేత ప్రోత్సహించబడి సైన్యమంతా దుర్యోధనుని రక్షణకై వడివడిగా సాగిపోతోంది. ముందు దుర్యోధనుడు, తర్వాత ఆవులు. ఆవుల పక్కనుండి భయభ్రాంతులతో గోపాలకులు, వాళ్ళ వెనుక సైన్యం వెడుతోంది. ఉన్నట్లుండి ప్రచండమారుతంలా ఈతని రథం వచ్చింది.

            ‘తానును గెలనఁ గ్రోశద్వయ మాత్రంబు నడచి పురుహూతపుత్రుం డుత్తరున కిట్లనియె’- ఆ క్రోశద్వయ దూరం దాటి సైన్యం దగ్గరికి వచ్చేశాడు. ‘ఇదె గోవర్గము సేరవచ్చితిమి’- పశువుల దగ్గరకు వచ్చేశాము. ‘పోనింకేల’ ఇంక ముందుకు వెళ్ళవలసిన పని లేదు. ‘సైన్యంబులుం గదియన్వే చనుదెంచె’- సైన్యం కూడ మనను ఎదిరించడానికి వచ్చేస్తున్నది. ‘రెంటి నడుమంగాఁ జొచ్చి’- రెండుసైన్యాల మధ్యలోకి వెంటనే ఆ రథం తీసుకుని రా! ‘ వచ్చు నున్మద వీరావలికిన్ భుజావిభవ విన్యాసంబు గాన్పించి మాన్చెద గర్వంబు మరల్చెదం బసుల; నాచేఁ జిక్కు రా జెమ్మెయిన్’- నాకు అర్థమైపోయింది. ఇప్పుడు వారు నిర్మించిన వ్యూహంలో వారే బందీలైపోయారు. మనం చేయవలసిందల్లా ఒకటే. ఇప్పుడు వెంటనే మధ్యలోకి పోనీ. ఇటు వచ్చే యోధులనందరినీ నేను ఆపేస్తాను. అక్కడినుంచి అటువైపు వస్తాను. వచ్చేటప్పుడు ఈ సైన్యం ఆ సైన్యంతో కలిసిపోతుంది. అక్కడ ఖచ్చితంగా రాజు ఉండి ఉంటాడు. నేను తప్పకుండా రాజును పట్టుకుంటాను. ఎంతో కఠినమైన పనిని చాలా సులభంగా చేసుకున్నాడు. ఒక్కసారి చుట్టూ చూశాడు.

            ‘అనుటయు విరాటతనయుఁడు మొనకడ్డము గాఁగఁ దూర్పుమొగమై రథముం గొని’- అర్జునుడు ప్రేరేపించగా ఉత్తరుడు తూర్పుదిశగా కురుసేనకు అడ్డంగా రథాన్ని నడిపాడు ‘కట్టెదిరికిఁ బోయినఁ దన మూపులు రెండు నపుడు దలకుం గడపన్’- ఒకసారి ఆ సైన్యానికి ఎదురుగా వెళ్ళేటప్పటికి యుద్ధోత్సాహంతో అర్జునుని భుజాలు పొంగి తలకు సమానంగా వచ్చాయి. ఇది ఒక మహాపురుషలక్షణం.

            ‘వ్యూఢో రస్కః వృషస్కంధః సాలప్రాంశు ర్మహాభుజః ఆత్మకర్మ క్షమం దేహం క్షాత్రో ధర్మ ఇవాశ్రితః’ - కాళిదాసు ‘రఘువంశం’ కావ్యంలో రఘుమహారాజు తండ్రి దిలీపమహారాజు శరీరాకృతిని వర్ణిస్తూ బలసిన ఆబోతు మూపులంత బలంగా ఉండే భుజాలు కలవాడని చెబుతాడు. ఆ మూపులు రెండు మూడయినాయి అని ఒక పలుకుబడి ఉంది. ‘తేరు సమ్ముఖంబు సేయించి పేరు వాడి క్రీడి కరతలం బెత్తి’ - పశువుల దగ్గరకు వెళ్ళి ఒక్కసారి చేయెత్తి నిలు నిలు మని యదల్చిన’ -  ఆ ముందు పోతున్న ఆవులను, గోపాలకులను చూసి వెంటనే పశువులను ఆపాడు. వెంటనే సైన్యమూ ఆగింది. ఏం జరుగుతోందో ఈ సైన్యానికీ అర్థం కాలేదు. ‘వెడలు నిశిత శర పరంపరల అదల్చిన ఘోషంబు తోడన్ - మాట్లాడుతూ నిలు నిలు అన్నాడు. అంటూనే బాణం వదలిపెట్టాడు. ‘అదల్చిన ఘోషంబు తోడన్ నిశిత శరపరంపరల దట్టంపుఁ బఱపున నంబరంబు నీరంధ్రం బగుటయు’ - ఆ సవ్యసాచి బాణవర్షాన్ని కురిపించాడు. ‘దట్టంపుఁ బఱపున నంబరంబు నీరంధ్రం బగుటయు తదంధకారం బగుటయు’ - బాణాలవల్ల వచ్చిన చీకటి, భయం వల్ల వచ్చిన చీకటి. ఆ సైన్యానికి రెండు చీకట్లూ కమ్మినాయి.

Player
>>