కురువీరుల పరిచయం1

ఇక్కడనుంచి విరాటపర్వం అయిదవ ఆశ్వాసం మొదలవుతుంది. అర్జునుని విజయాన్ని, పాండవాభ్యుదయాన్ని సూచిస్తూ తిక్కనగారు ఆశ్వాస ప్రారంభపద్యాన్ని అత్యద్భుతరీతిలో రచించారు. ఆశీర్నమస్క్రియావస్తునిర్దేశంగా ప్రారంభం ఉండాలని సంప్రదాయం. ఇక్కడ ఒక్కొక్క ఆశ్వాసం ఒక్కొక్క కావ్యంగా తిక్కనగారు మలిచారు. కృతి పతి అయిన హరిహరనాథుడిని సంబోధిస్తూ ఇక్కడ తిక్కనగారు రాసిన పద్యమిది.

          ‘శ్రీ సంపాదన చాతుర్యా సేవ్య పదారవింద!’ - హరిహరనాథుడిని సంభోదిస్తున్నాడు! “యౌగిక విద్యోద్భాసిత మూర్తి మయాత్మ వ్యాస సమాసైక రూప! హరిహరనాథా!” - వ్యాస సమాసైక రూపా అని హరిహరనాథుడిని సంబోధించాడు. కానీ ఇక్కడ అటు హరికీ, ఇటు హరునికీ ఇరువురినీ కలిపిన హరిహరనాథుడికీ అన్వయించుకుని చెప్పిన పద్యంలాగా కూడా కనిపిస్తుంది. శ్రీ సంపాదన చాతుర్యా – పశుసంపదను అత్యంతమైన నేర్పుతో సంపాదించుకున్నవాడు. ‘సేవ్య పదారవింద!’ - తనను కొలిచే వాళ్ళకు ఎప్పుడూ అనుకూలంగానే ఉంటాడు. ‘యౌగిక విద్యోద్భాసితమూర్తి’ అక్కడ హరి హరనాథుని విషయంలో యోగవిద్యతో ప్రకాశించేవాడని అర్థమయితే ఇక్కడ అర్జునుడు సవ్యసాచి. బాహువుల ద్వయంతో యుద్ధం చేసే నేర్పు గలవాడు. అదొక విచిత్రమైన విద్య. వ్యాస సమాసైక రూప ఇక్కడ పొందుపరిచిన హరిహరనాథతత్వం వ్యాసులవారినుండి రూపుదిద్దుకున్నది.

          వ్యాసులవారు చేసిన సమాసమే ‘హరిహర’ అనే పదం. ‘హరి’ అనేది ఒక పదం, ‘హర’ అనేది ఒక పదం, రెండు పదాలను కలిపే ప్రక్రియ సమాసం. భాషను ఉపయోగించ డానికి పదాలను కలుపుకోవడానికి ఒక అనుకూలతను కలిగించే ఒక విధానం. సమాసం అంటే సంగ్రహం సంక్షిప్తం అని అర్థం. సమాసాలు భాషకు ఒక విధమైన సౌందర్యాన్ని సౌలభ్యాన్ని కలిగిస్తాయి. ఈ హరిహర అనే పదంలో ఇద్దరి తత్త్వాలను సంయుక్తం చేసి చెప్పారు. ఇది వ్యాసులవారు దేవీభాగవతంలోను, హరివంశంలోను ప్రస్తావించారు. బాణాసురుడి ఘట్టంలో, ఈశ్వరుడు యుద్ధానికి వచ్చిన సందర్భంలో ప్రస్తావించారు. విష్ణువు అవతారంలో ఉన్న కృష్ణమూర్తి అనిరుద్ధుడిని బాణుని చెర నుంచి విడిపించడానికి వెళతాడు. బాణునికి రక్షణగా ఉంటానని వరమిచ్చిన ఈశ్వరుడు అక్కడ కృష్ణుడికి అడ్డుపడతాడు. శివకేశవులకు అక్కడ యుద్ధం జరిగే పరిస్థితి వస్తుంది. అప్పుడు శివుడి భార్య మృడాని-శక్తి, లంబాదేవి అనే ఆమెని యుద్ధానికి పంపుతుంది. ఆమె కృష్ణుడికి మాత్రమే కనబడేట్లు తన రూపాన్ని చూపిస్తూ అక్కడకి వెళుతుంది. [దేవీ భాగవతం]‘నమో హరిహరాయ హిప్రాయ నమో హరిహరాయచ’ అని ఉపయోగించిన సమాసం అక్కడ ఏర్పడుతుంది. అది వ్యాససమాసైక రూపం. మరి అర్జునుని పరంగా వ్యాసుడు అనే పదానికి మనం అర్థం ఎలా చెప్పుకోవాలి? ‘ఆస ఉపనిశనే – ‘ఆస’ - ఉండడం, ‘వి + ఆస’ - విశేషంగా, అనేక ప్రకారాలుగా ఉండడం. అంటే సర్వత్ర ప్రభావం కలిగి కనబడడం. వ్యాసులవారి మేధాదీపం దీప్తి అన్నిచోట్ల వెలుగులను చిమ్ముతూ ఉంది కదా! వేద విజ్ఞానంలో, తార్కిక విజ్ఞానంలో, ధర్మశాస్త్రసంగ్రహంలో, ఇతిహాసవిజ్ఞానంలో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలలో మూల స్థానమై నిలిచినవారు వ్యాసులవారు. కాబట్టి విశేషంగా వ్యాపించినవాడు వ్యాసుడు. ‘విస్తారో విగ్రహో వ్యాసః’ అని వివరణం. మరి హరిహరనాథుడిని ‘వ్యాస’ అని ఎలా చెప్పుకుంటాం? హరి, హర ఇద్దరూ విడివిడిగా అనేకములైన రూపాలతో ప్రకటితమౌతున్నప్పటికీ కూడా, పరమార్థంలో ఆభేదమైన ఏకమూర్తి స్వరూపమే. ఆ సత్యాన్ని నిశ్చయంచేసే సమాససంక్షిప్తత చేత ఒక్కటిగా ఉన్నారని వ్యాససమాసైక రూప. అర్జునుడు కూడా ఆ యుద్ధంలో అంతా తానై విజృంభించబోతున్నాడు. కాబట్టి అర్జునుడికి అభ్యుదయంగా తిక్కనగారు ఈ పద్యాన్ని ప్రారంభించారు.

Player
>>