కురుకుమార సంహారం1

అట్టియెడ మున్ను తురంగమఖురాదులన్ దూలిన  కెంధూళియుం, బైపయి నెగయఁ బరబలంబు నెత్తుట చొప్పిల్లుతూ నుచ్చి చను వివ్వచ్చు నిశిత శర పరంపరలు సైనిక శరీరంబులపై సుడిసి తడిసి రుధిర శీకర నికర వికీర్ణ రవికిరణ పరిణతం బగు సమీరణంబును ధారాళ కరాళ రక్త పరిషిక్త విశ్వంభరా భాగంబును గలయం గెంపు సంపాదించి యకాలసంధ్య నావహించె’ - అట్టియెడ - అర్జునుడు యుద్ధం చేస్తున్నప్పుడు, అశ్వముల కాలిగిట్టలచేత దుమ్ము లేచి, సూర్యకిరణాలు అందులో కలిసి, సైనికులు, అశ్వములు ఆదిగా కలిగిన వాటి శరీరముల నుండి చిందిన రక్తముతో ఆ ధూళి కలిసి, భూమిపై పరచుకున్న రక్తముతో కూడా కలిసి అకాలసంధ్యలా భ్రమింపజేసింది.

            ‘తదుచితవ్యాపార పారంగతంబులై పొడసూపిన యుడుగణంబులన్ బోలె’- మరి చీకటితోకూడిన సంధ్య వస్తే, నక్షత్రాలు ఉండాలి కదా, అవి ఎక్కడి నుండి వచ్చాయి? ‘ధనంజయ సాయక దళిత కుంజర కుంభ వికీర్ణ మౌక్తిక విసరంబుల వలనన్- అర్జునుడు ప్రయోగించిన బాణములచేత ఛేదింపబడిన గజముల కుంభస్థలముల నుండి రాలిపడిన ముత్యాలే నక్షత్రములుగా కనిపించాయి. ‘సముదీర్ణ మదవేగదుర్నివార వారణ విదారణంబులగు నర్జునాస్త్రపాతంబులం బెదరి తేం ట్లెగయుటం పొగలెగయుటయును- భయంకరమైన వేగముతో వస్తున్న ఈ గజబలాన్ని చెల్లాచెదరు చేయడానికి అర్జునుడు చేసిన బాణప్రయోగం వల్ల ఆ గజముల కుంభస్థలముల భేదింపబడ్డాయి. అప్పుడు తొండమునకు ఇరు వైపుల ఉండే గండస్థలాలనుండి స్రవిస్తున్న మదజలపు ఆకర్షణీయమైన వాసనకు ముసిరిన నల్లని తుమ్మెదలు ఆ గండస్థలాలు ఖండింపబడగానే పైకి ఎగిరి పొగలాగా కనబడ్డాయి.

            ‘ప్రతిభట బాణ ఘట్టనంబున పాండవ మధ్యము కాండప్రకాండం బుల నిబిడజ్వాలలు నెగుడుట మంటయునుగా’- మరి నిప్పు లేనిదే పొగ పుట్టదు కదా! ఆ నిప్పు ఎక్కడి నుంచి వచ్చింది? ‘ప్రతిభట బాణ ఘట్టనంబున’- శత్రు సైనికులు ప్రయోగిస్తున్న బాణాలు, అర్జునుడు వేసిన బాణాలు, రెండు లోహసమన్వితములే కాబట్టి అవి రెండు ఒరుసుకొని ఆ రాపిడిచేత మంటలు లేస్తున్నాయి. ‘మూర్తంబగు తదీయ క్రోధ దవాలనంబు’- వీళ్ళ మీద విజృంభించిన అర్జునుని క్రోధము అనే దావాగ్ని చేత ‘ఛటచ్ఛటా శబ్దంబుల చాడ్పునన్ చెలంగుచున్న- ఛట ఛట ధ్వనులు వస్తున్నాయి. ఒక దావాగ్ని మహారణ్యాన్ని దహిస్తుంటే, చెట్లు, వృక్షములు వాటి శాఖలు దహింపబడి ఫెళఫెళ రావములు వినిపిస్తాయి. అలాగే అర్జునుడి క్రోధము అనే దావాగ్ని నుండి ఛటఛట రావములు వస్తున్నాయి. ఆ చప్పుళ్ళు ఎక్కడినుండి వస్తున్నాయి ‘యుధిష్ఠిరానుజు అతినిష్టుర బల్ల భజ్యమాన బలవ దారాతి ఖరాస్తి నిస్వనంబుల వలనను’- అర్జునుడు వేస్తున్న ఆయుధములచేత శత్రుసైనికుల శరీరములోని ఎముకలు కూడా విరిగి ఫెళ్ళుమనే చప్పుడు వినవస్తున్నది. ఈ ఎముకలు విరుగుతున్న చప్పుళ్ళు ఛటఛటా రావములు అయ్యాయి.

             ‘తొట్టి తొట్టి యెడనెడ మడువులుగట్టు శోణితంబు నీళ్లునందుబడి తేలాడు వెలుగొడుగులు పుండరీకంబులు- ఆ ప్రదేశంలో రక్తము మడుగులు కట్టింది. ఆ రక్తపు మడుగులో రథములమీద ఉన్న గొడుగులు, సైనికులు పట్టుకొని వస్తున్న వెలిగొడుగులు పడి అవి తామరలలాగా కనిపిస్తున్నాయి. విరిగి పడిపోయిన వింజామరలు హంసల లాగా కనిపిస్తున్నాయి.

            యుద్ధాలలో యోధులకు అలసట కలుగకుండా వింజామరలు వీస్తుంటారు. రథములో ఉండేది ఒక్క రథికుడే అని అనుకోకూడదు. రథికుడికి ఇరు వైపులా ఇద్దరు ఉండి అతనికి శరీరములో గ్లాని కలుగకుండా వింజామరలు వీస్తూ ఉంటారు. ఆయుధాలు అందించే వాళ్ళు ఉంటారు. సారథి, రథికుడు కాక, చక్రరక్షకులు ఉంటారు. రథగమనంలో రాళ్ళ వంటివి అడ్డువస్తే వంగి వాటిని పక్కకు తీయటానికి రెండు వైపులా చక్రరక్షకులు ఉంటారు. ఇంతమందిని సంరక్షించుకుంటూ, యోధుడైనవాడు యుద్ధం జేయాలి.

Player
>>