కర్ణార్జునుల ద్వంద్వయుద్ధము1

కర్ణార్జున సంగ్రామం

‘ఇవ్విధంబున వృషభంబున కాదికొని బెబ్బులియునుం బోలె రాధేయు దెస నడచు కవ్వడిం గని చిత్రాంగదుండును చిత్రరథుండును సంగ్రామజిత్తును దుష్ప్రహుం డును’- కాని కర్ణుడు సామాన్యుడా? యోధవరుడు! అంగదేశపు ప్రభువు! కాబట్టి దుర్యోధనుడికి రక్షణగా వీళ్లందరూ వచ్చినట్లుగా, కర్ణుడిని ముట్టడిస్తునప్పుడు అతని అనుయాయులు, చిత్రాంగదుడు, చిత్రరథుడు, సంగ్రామజిత్తు మొదలగు వారు అర్జునుడికి అడ్డంగా నిలబడ్డారు. వీళ్ళందరూ ‘తలమీఱి నిశిత శరమండలిఁ గప్పెం’ పార్థుడిని ‘బాణవేణికా పరంపరలు నిగుడ నొక్కపెట్ట కవిసిన’ ఒక్కసారిగా చుట్టుముట్టారు. ‘గుణధ్వని తంత్రీనాదంబుగా’ కర్ణునికి రక్షణగా నిలచిన చిత్రాంగదుడు, చిత్రరథుడు, సంగ్రామజిత్తు, దుష్ప్రహుడు, చిత్రసేనుడు, వివింశతి, దుర్ముఖుండు, దుర్జయుడు, వికర్ణుడు, శత్రుంతపుడు, దుశ్శాశనుడు వీరంతా విలువిద్యలో నిష్ణాతులే!

ఆ విలుకాండ్రు ఎదుర్కొనగా ‘ఆ విండ్లవారు ఒత్తుకాఱుగా గాండీవంబు వీణగా’ అర్జునుని చేతిలోని గాండీవము వీణగా మారిపోయింది. అక్కడికి వచ్చిన విలుకాండ్ర గుణధ్వని కూడా ఒక విధమైన నాదంతో ఉంది. అది ఎలా ఉందంటే ఒక నాట్యకారిణి నృత్యం చేయాలని వచ్చినపుడు లేదా ఒక సంగీతకళాభిజ్ఞుడు సంగీతప్రదర్శన చేయటానికి వచ్చినపుడు పక్కన శ్రుతిపట్టడానికి ఒకళ్లు ఉండాలి కదా! ‘ఒత్తుకాఱు’ అంటే శ్రుతిపట్టేవాళ్ళు. విలుకాండ్రు ‘ఒత్తుకాఱు’- శ్రుతిపడుతుంటే ఈయన గాండీవాన్ని పట్టుకుని వీణాగానం చేసినట్లుగా వికర్ణుడు మొదలైనవారితో యుద్ధం చేసాడు.

ఈ విధంగా జరుగుతున్న యుద్ధంలో కర్ణుడి తమ్ముడైన సంగ్రామజిత్తు అర్జునుడిపైకి విజృంభించగా ఒక్క బాణంతో ఆ సంగ్రామజిత్తును నేలకూల్చాడు. మామూలుగా చూస్తే ఒక మనిషిని చంపడమనేది ఎంతటి భయంకరమైన కార్యమండీ! ఒక మనిషిని యుద్ధంలో హతమార్చినప్పటికీ చూస్తూ చూస్తూ ఒక మనిషి ప్రాణాలు నిట్టనిలువున తీయటమనే విషయం జీర్ణించుకోవడానికి కష్టంగా అనిపిస్తుంది. వ్యక్తిగతమైన ధర్మాన్ని వదలి క్షాత్రధర్మాన్ని అనుసరించవలసిన చోట కరుణకు తావు ఉండకూడదు. అక్కడ ఖచ్చితంగానే ఉండాలి. ‘లాలయేత్ పంచవర్షాణి దశవర్షాణి తాడయేత్’ అన్నారు. కన్నకొడుకునైనా అయిదేండ్ల తరువాత మాట వినకపోతే రెండు వాయించమనే చెప్తారు. అయ్యో! దెబ్బ తగులుతుందే, భయపడతాడే అనుకుంటే లాభం లేదు. సామాజిక న్యాయనిర్వహణ కోసం క్షత్రియుడు స్వీకరించిన పాత్ర రక్షణకు సంబంధించినది కాబట్టి శిక్షించాల్సి వచ్చినప్పుడు శిక్షించవలసినదే. దానికి అనుగుణమైన పద్ధతిలోనే హింసాప్రవృత్తిని అనుసరించవలసినదే! అంతకుమించిన మార్గం లేదు. కాదని అనుకుంటే మనం ఆత్మవంచన చేసుకున్నట్లే! కానీ సృష్టి ధర్మంలో మాత్రం తద్విరుద్ధమైనది కనబడదు. అవసరమైనచోట తప్పనిసరిగా మారణ హోమం జరగాలి. అందుకనే ఇక్కడ కూడ అర్జునుడు చేస్తున్న అరివీరరణమారణకాండలో కూడా అటువంటి ప్రళయతాండవహేల కనిపించింది.

‘అపుడు రాధేయుఁ డిమ్మెయి ననుజుపాటుఁ జూచి యేనుంగునకు సిళ్ళు సూపినట్లు కవిసి’  తమ్ముడు అర్జునుని చేతిలో హతమగుట చూసిన కర్ణుడికి అమితమైన కోపం వచ్చి, ఏనుగుకు పిచ్చి పడితే ఎలా ఉంటుందో ఆ విధంగా చెలరేగిపోయాడు. ‘మత్స్యభూకాంతు తనయు నేసి పండ్రెండు శరముల నేసె నరుని’ విజృంభించి ఉత్తరుడిని, అర్జునుడిని బాణాలతో కొట్టాడు. ‘కేసరి విక్రముండు కపికేతనుఁ డత్తఱి వైరివీరసం త్రాస కరప్రకారమగు దర్పమెలర్పఁగ బాణజాల విన్యాసమునన్ వెసం బొదివె నర్కసుతున్’ అప్పుడు అర్జునుడు ‘గరుడుండు పాము నుద్భాసితపక్షుఁడై పొదువు భంగిగరుత్మంతుడు వచ్చి పామును పట్టుకొన్న విధంగా కర్ణునిమీదికి వచ్చాడు. కర్ణార్జునులు బద్ధవిరోధులు. స్పర్ధతో విద్యను పెంచుకున్న మహాధానుష్కులైన వారిద్దరూ ఎట్టకేలకు ముఖాముఖిగా వచ్చారు.

Player
>>