భీష్మార్జునుల యుద్ధము1

భీష్మార్జున యుద్ధం

తే.     కనకమయతాల కేతువు క్రాలఁ జిరత
               
టిల్ల తాలీలఁ గలిగి శోభిల్లునంబు 
      
దంబు చాడ్పున సురనదీతనయుఁడున్న
            
వాఁడు చూచితె మత్స్యభూవరతనూజ.                        (విరాట. 5. 162)   

 ‘ఉత్తరా! సువర్ణకాంతిప్రభలతో వెలుగుతున్న తాళకేతనంతో, మెరుపుతీగతో ఉన్న మేఘంలాగా మా తాతగారైన భీష్మాచార్యులవారు ప్రకాశిస్తున్నారు. చూశావా?’ అన్నాడు అర్జునుడు.

‘బలువిడి మన దివ్యాస్త్రం బుల చవి సూపంగవలయుఁ’- మన దివ్యాస్త్రాల వాడి, వేడి మా తాతగారికి చూపాలి. ‘పోనిమ్ము రథం బలసగతి నతనిదెస కని పలికిన నతఁడట్ల చేసెఁ బరమప్రీతిన్’- మన రథాన్ని నెమ్మదిగా అటువైపు తీసుకెళ్ళు అనగా అర్జునుడి మాటలను అనుసరించి ఉత్తరుడు రథాన్ని భీష్మాచార్యుల దిశకు మళ్లించాడు. వస్తున్న అర్జునుడిని భీష్ముడు చూసి, ‘శాంతనవుండు నప్డు నిజశంఖము కౌరవరాజసైన్యముల్సంతసమంద నొత్తుడు’ - కౌరవసేనకు ఉత్సాహం వచ్చేలాగ శంఖానాదం చేశాడు. ‘ససంభ్రమలీల నెదుర్కొనంగ దుర్ధాంత భుజాబలప్రకట దర్ప మెలర్ప నరుండు నొత్తె దిగ్ధంతి నికాయకర్ణపుటదారణవృత్తము దేవదత్తమున్.’ అర్జునుడు కూడా ప్రతిగా దేవదత్తమును పూరించాడు.  

మలసి ఱంకెలు నైచుచు మాఱుకొనిన వృషభములభంగి నక్కురువృషభులిట్లు సమదగతిఁ’- ఒకరిపై ఒకరు ఆ కురువృషభులు రంకెలు వేసుకుంటూ ‘సమదగతిఁ జేరునెడన్’ యుద్ధమునకు సిద్ధమయ్యారు. ‘చూచి రమరు లర్థి ననిమిషత్వంబు దమ కప్పు డచ్చుపడఁగ’- ఆకాశమార్గంలో నిలిచి చూస్తున్న అమరులు తమ అనిమిషత్వానికి సార్థకత లభించిందనుకున్నారు.

అనిమిషత్వము అంటే ఏమిటి? రెప్పపాటు లేనితనం. మనుచరిత్రలో ప్రవరుని చూసిన సందర్భంలో వరూధిని స్థితిని గురించి పెద్దన గారు ఇలా వర్ణిస్తారు. ‘అనిమేషస్థితి మాన్పి బిత్తరపు చూపు అస్వేదతావృత్తి మ్రాన్పె’ ప్రవరుడి సౌందర్యము చూసినప్పుడు ఆమెకు అనిమేషస్థితి మాని పోయిందట.. ఇటువంటి పరిస్థితే వేరొకరికి కూడా వచ్చింది, ఆధునికుల్లో రెండువందలయేళ్ళ కిందట ఒక కవిగారికి వచ్చింది. కూచిమంచి తిమ్మకవి అని ఒక కవి ఉండేవాడు. మంచి రసికాగ్రేసరచక్రవర్తి. శ్రీనాధుని కోవలోనివాడు. ‘రసికజన మనోభిరామము’ అని ఒక ప్రబంధం వ్రాశాడు.  ఈయన బాగా సౌందర్య వంతుడు. ఆయన ఒకసారి వారవనితల వీథిలో వెళుతుంటే, ఒక సుందరాంగి ఈయనని చూసి మోహించింది. వీళ్లందరికి కూడా కవులంటే ఎందుకో ఇష్టం! వాళ్ళని గురించి వర్ణించి చెప్తారనేమో! ఆ వీధిలో ఆయన వెళుతుంటే ఈమె కూడా వరూధినిలాగా తెగించింది. వరూధిని కూడా ప్రవరుని తన వాదాలతో జయించలేకపోయేసరికి, చివరకు ‘ప్రాంచద్భూషణ బాహుమూలరుచితో పాలిండ్లు పొంగార పై యంచులు మ్రోగగ కౌగిలించి అధరం బాసింప’ అంతదూరం పోయింది కదా! ‘హా శ్రీహరీ! యంచున్ బ్రాహ్మణు డోర మోమిడి’ –ప్రవరుడు ముఖం పక్కకి తిప్పుకున్నాడు. ‘తదీయాంసద్వయం బంటి పొమ్మంచున్ తొలంగదోచె’, ఆమె అంసద్వయం, అంటే భుజాలు పట్టుకుని తోసేశాడు. వరూధిని ‘పాటున కింతులోర్తురె’, నువ్వు ఇంత మోటుతనం స్త్రీలపట్ల చూపవచ్చునా, ‘నీవు తోయ యిచ్చోట భవన్నఖాంకురం సోకె’ అని ఏడ్చింది. 

Player
>>