దుర్యోధనార్జునుల యుద్ధము1

ఇంత భీకరమైన యుద్ధంలో సారథ్యం చేస్తున్న ఉత్తరుడు అలసిపోయాడు. ఇంతకుముందే చెప్పాడు తనవల్ల కాదని. కర్ణుడు, అశ్వత్థామ, భీష్మాచార్యులు పక్కకు వెళ్ళిపోయారు. ద్రోణాచార్యునితో పాటు అందరూ పరాజితులయ్యారు. అయినా యుద్ధానికి అంతు లేకుండా కనిపిస్తోంది. అర్జునునితో ఇలా అంటున్నాడు.

‘ఉడుకువ లేచి కయ్యమున కోర్వగ వచ్చునె’- కొంచెం కూడా ఊపిరి తీసుకోవడానికి కూడా సమయం ఇవ్వడం లేదు ‘నాకు డప్పి వుట్టెడు’- నీకెలా ఉన్నదో కాని నాకు కొంచెం దాహం కావాలి. ‘ఒకమాటు నాగ్రహము డింపవు నీవును’- ఒక్కసారి కూడా నీవేమీ తగ్గేటట్టు కనపడటం లేదు. యుద్ధం చేస్తూనే ఉన్నావు. ‘జక్కు సేసి పచ్చడి గలపంగ’- సైన్యాన్ని పిండి పిండి చేశావు. ‘వెండియును జండితనంబున వచ్చి పోరెడు మొనలింకఁ’- అయినా కూడా ఎవరినో ఊతగా చేసుకుని, మళ్ళీ మళ్ళీ వస్తున్నారు ‘ఇంకఁ జాల నొనరింప భవధ్రథ సూతకృత్యమున్’- ఇక ఈ సారథ్యం నేను చేయలేను.

‘కవ్వడి నవ్వుచు నేను గలుగ నీకు నోహటింప నేల యంతియవలసినం దురంగంబులఁ దోడు గడిపెద’- నీకు శ్రమ తగ్గించడానికి నేను రథాన్ని నడుపుతానులే. ‘ఇంచుక సైరించి నిలువవలయు’- కొద్దిగా సహించు, రథాన్ని నడుపుకుని నేనే యుద్ధం కూడా చేస్తాను. అయిపోయింది. ‘ఎల్లపనులును జక్కనయ్యె’- అన్ని పనులూ అయిపోయాయి. ‘రా జొక్కరుండు కొఱంత’- ఆ రాజు ఒక్కడి పనిపట్టాలి. ‘ఆతం డభిమాని మనలం గని సరకు గొనం డిప్పు డున్న చందంబు మన తోడం దలపడం దడంగుట దోఁచుచున్న యది’ - అతడు దురభిమాని. ఆ దుర్యోధనుడి పని చూసుకుని మనం వెళ్ళిపోదాం అని చెప్పి దుర్యోధనుడి దగ్గరకి తీసుకు వెళ్ళమన్నాడు.

 ‘పులిగోల వేసినట్టిట్టలపురయంబునఁ గడంగుటయుఁ’- దుర్యోధనుడు ఒక్కసారిగా అర్జునుడిని చూశాడు. క్రోధం, అసూయ, మాత్సర్యము అన్నీ పెల్లుబికి వచ్చాయి. ఆ భావపరంపర లోపల కలచి వేస్తుంటే బయట అర్జునుని శర పరంపరలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటిమధ్యలో సతమతమవుతున్నాడు. దుర్యోధనునికి రక్షణగా ఉన్న వీరులనందరినీ కూడా అర్జునుడు చెదరగొట్టాడు.

యోధవరులందరూ అర్జునుని పరాక్రమానికి వెరసి పరుగందుకునేసరికి, కర్ణుడు, ‘కూడముట్టెఁ గ్రీడి గురువంశమున కెల్ల మూలకంద మీనృపాలుఁ’- కురు వంశానికంతటికీ మూలం ఈ రాజే, ‘ఇచటఁ గాచి కొనుట యెల్ల పౌరుషములుఁ జేఁత నిలిచి లావు సేయవలయు’- మనం అతనికి రక్షణగా వెళ్ళాలి అని పిలుపునివ్వగా దుర్యోధనుడు కూడా భీష్మాది కురువీరులనుద్దేశించి,  ‘లోకంబుతోడివారుగమీకుం జనునయ్య మగఁటిమికి గుఱిగాదే’ అని పలికి వారి సాయంతో మరలిపోసాగాడు.

Player
>>