అర్జునుడి ఎత్తిపొడుపులు 1

అర్జునుడు వెళ్ళిపోతున్న దుర్యోధనుడిని ఆపి, ‘క్షత్రియుఁ డోడునే తగదు కౌరవరాజ’- నువ్వు క్షత్రియవంశంలో పుట్టి ఇలా పారిపోవుట తగునా? ‘ఒకండ నేఁ బృథా పుత్రులలోనఁ బిన్న’- నేను కౌంతేయులలో చిన్నవాడను. నువ్వు కౌరవులలో పెద్దవాడివి, నీకింత బలగం ఉంది. నేనొక్కడినే వచ్చాను. ‘నినుఁ బోరికి బిల్వఁగ మాని’- నిన్ను పోరుకి పిలవడానికి వస్తే మాని,  ఈ ‘మాని’, తెలుగు ‘మాని’ కాదు. మానము కలిగినవాడు ‘మాని’ అభిమాని, ‘మాని నాఁగ నిద్ధాత్రి బ్రసిద్ధి కెక్కి’- అభిమానధనుడైన సుయోధనుడు అని జగత్తులో ప్రసిద్ధికి ఎక్కిన నువ్వు ‘బలదర్పసమగ్రుఁడ వైన నీవు నీమిత్రులుఁ గూడ నిట్లయిన మెత్తురె వత్తురె కొల్వ భూభుజుల్’- ఇలా చేస్తే క్షత్రియలోకం పరిహసించదా? ఇది క్షాత్రగుణం కాదు నిలబడి పోరు సల్పు.

సీ.    ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ రాఁబురవీథులఁగ్రాలఁ గలదె

మణిమయంబైన భూషణజాలమున నొప్పి యొడ్డోలగంబున నుండఁ గలదె కర్పూరచందనకస్తూరికాదుల నొంపుసొంపార భోగింపఁగలదె
యతిమనోహరలగు చతురాంగనలతోడి సంగతి వేడ్కలు సలుపఁ గలదె

ఈ పరాభవమైన తరువాత నువ్వు ఏనుగులనెక్కి రాజప్రాసాదంలో తిరగగలవా? మణిమయ భూషణాలను ధరించి మనగలవా? ఏ ముఖం పెట్టుకుని రాచరికాన్ని అనుభవించగలవు? మనోహరులైన స్త్రీలతో హాయిగా కాలం గడపగలవా? ‘కయ్యమున నోడి పాఱినఁ గౌరవేంద్రవినుము నా బుద్ధి మరలి యీ తనువు విడిచి సుగతి వడయుము’ - యుద్ధంలో ఓడిపోయి పారిపోతున్న ఓ కౌరవరాజా! నా మాట విని, ఈ శరీరాన్ని విడిచిపెట్టి క్షత్రయోచిత స్వర్గానికి వెళ్లు. ‘తొల్లింటి చూఱఁ గలదెజూదమిచ్చట నాడంగ రాదు సుమ్ము’-.  ఇది పాచికలు వేస్తూ ఆడుకునే జూదం కాదు. యుద్ధము. క్షత్రియుడు విజయమో వీరమరణమో  తేల్చుకోవాలి.

Player
>>