దుర్యోధనుడి పలాయన మంత్రం1

ఇంతలో అందరికీ మెలకువ వచ్చింది. ‘కౌరవేశ్వరుండు కనువిచ్చి దిక్కులు గలయఁ జూచి పార్థుఁగాంచి కడఁగి యడరఁ జూచుటయును’- కురుసార్వభౌముడు కూడా ఒక్కసారిగా మైకం పోయి కలయ చూసి, ‘కలయఁ జూచి పార్థుఁ గాంచి కడఁగి యడరఁ జూచుటయును అమరనదీసూనుఁ డతని కిట్టు లనియె నల్ల నగుచు’ మరల పార్థునిపై యుద్ధానికి సిద్ధమయేసరికి, భీష్ముడు అతనితో ఇలా అన్నాడు. ‘ఇంత యెఱుంగవు సైన్యములింతవడిం దలలచీర లెఱుఁగక మోహాక్రాంతంబు లయ్యెఁ’- భీష్మాచార్యుడు ఇప్పుడు ఒక రాజసేవానిబద్ధుడైన యోధునిగా కాక ఒక వంశరక్షకుడైన పెద్దవానిగా దుర్యోధనునికి బుద్ధి చెప్పాడు. నీకు జరిగినది అర్థం కావటం లేదు. మన సైన్యం చూస్తే ఒంటి మీద స్పృహ లేకుండా పడి ఉన్నది. ‘కౌంతేయుఁడు సొరఁడు గాని క్రౌర్యంబునకున్’- మనమీ స్థితిలో అపస్మారస్థితిలో ఉండగా ఏమైనా చేసి ఉండవచ్చును. కానీ ఏం చేయలేదు.

మెడ యెఱగఁ జేతి కైదువుపడ నిను నీ వెఱుఁగకున్న భంగి గనియుఁ’- నువ్వలా నిస్పృహగా పడి ఉన్నప్పటికీ కూడా. ‘కవ్వడి యూరకుండు నటె’- అర్జునుడు ప్రాణాలతో వదిలాడు. ‘చెప్పెడు కొలదిఁయె వాని కరుణ పెంపు కుమారా’- ఇక్కడ దుర్యోధనుని రాజా, చక్రవర్తీ అని సంబోధించలేదు. కుమారా! నా మాట విను, నాయనా! అర్జునుడు మళ్ళీ రాకముందే మనం నిష్క్రమించుట ఉత్తమం.

          ‘మోహనబాణపాతమున మందలచీర లెఱుంగకున్న యీబాహుబలంబుతోఁ గడఁగి పార్థునిఁ దాఁకెడు బుద్ధి గ్రమ్మఱన్ సాహసవృత్తిఁ జేసి యవిచారతఁ బోయితిమేని వాఁడు పూర్ణాహుతి సేయఁడే’- అందరూ వివశులై కట్టుకున్న బట్ట విచారం కూడా తెలియని స్థితిలో మూర్ఛితులై ఉండగా అర్జునుడు కరుణించి అందరినీ ప్రాణాలతో వదిలాడు. ఇంతటితో ఆగక మనం మళ్ళీ అతని మీదకు పోతే, ‘మనల నందఱ నొక్కట మార్గణాగ్నికిన్’- యజ్ఞంలో సమిధలను ఆహుతి చేసినట్లుగా మనందరినీ తన బాణాగ్నిలో కాల్చి పారేస్తాడు. అర్జునుడి క్రోధం మధ్యందిన మార్తాండబింబంలాగా ప్రళయకాలభీకరంగా ప్రకాశిస్తూ ఉంది. ఆ తేజస్సు ముందు మనం నిలబడలేము. పదమూడు సంవత్సరాలుగా అణిగి ఉన్న అగ్ని ఒక్కసారిగా బయట పడితే ఎంతటి ఉత్పాతాన్ని కలిగిస్తుంది అనే విషయం అర్థమవుతూనే ఉన్నది. కాబట్టి

క.         మనదేశమునకుఁ బోదము

మనమల్లన తెరువువట్టి మత్స్యవిభునిగో

ధనముఁగొని యతడు ప్రీతిం

జనుఁ గాకటు మనకు నంతచల మేమిటికిన్.                 (విరాట. 5. 220)

మనదేశానికి మనం పోదాం అన్నాడు. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మొట్టమొదట ప్రతిఘటించిన కర్ణుడు విఫలుడై వెనుతిరిగి వెళ్ళి పోయాడు. ద్రోణాచార్యులు, కృపాచార్యులు, భీష్మాచార్యులు, వీళ్ళందరూ అర్జునుని ప్రతాపాన్ని, ఆ రోజు జరిగిన యుద్ధవిన్యాసాన్ని ఎదుర్కోలేక తల వంచి దారి ఇవ్వవలసి వచ్చింది. మరి ఇంతటి మహామహులే వల్ల కాదనుకున్నప్పుడు మళ్ళీ ఎదిరించి ప్రయోజనం లేదు, చేయవలసిన కార్యక్రమం ముందుంది కదా అనుకున్నాడు దుర్యోధనుడు.

Player
>>