విరాటుని వ్యాకులత1

తిరుగుప్రయాణం

అతండును జూపఱం దోలి నిలిచిన మదపుటేనుంగు చందంబున నిలిచి విరాట తనయున కిట్లనియె’ ఇంక ఆపి ఉత్తరుడితో ఇలా అన్నాడు.

          ‘పసులు మరలె’ - మన పశువులు మన నగరం దారి పట్టాయి. ‘శత్రుబలములు పీనుంగు పెంటలయ్యె’ శత్రువుల సైన్యాలు పీనుగు కుప్పలయ్యాయి. ‘రాజు’ - దుర్యోధనుడు, ‘పెద్ద దొరలు’ - మహామహులయిన యోధాగ్రేసరులు ‘చీరల ఒలువబడిరి’ వాళ్ళ తలగుడ్డలు లేని వారయ్యారు. బొమ్మ పొత్తికల కోసం అంతా తీసుకుని వచ్చావు కదా! ‘సిగ్గఱి బిరుదులు వైచిరి’ వాళ్ళు పెట్టుకున్న బిరుదులు పడిపోతున్నా వాటిని తీసుకోవడానికి కూడా వీలు కాక వెళ్ళిపోయారు. ‘ఇంక మగుడవలదె మనకు’ ఇంక మనం వెళ్ళిపోవచ్చు.

క.       హయములు మరల్పు మీ త

ల్లియు బంధులు నెడలు సంచలింప గుమురు గ

ట్టి యెదురు సూతురు వారికిఁ

బ్రియముగ శీఘ్రమ్మునం బురికిఁ బోవలయున్                 (విరాట. 5-223)

          ‘హయములు మరల్పు’ - గుఱ్ఱాలను వెనక్కి తిప్పు. ‘మీ తల్లియు బంధులు నెడలు సంచలింప గుమురు గట్టి యెదురుసూతురు’ మీ తల్లియూ, బంధువులు - తండ్రి అనలేదు. తండ్రి అక్కడ యుద్ధరంగంలో ఉన్నాడు కదా! తిరిగి వచ్చాడో లేదో తెలియదు. ఎంత ఉచితజ్ఞత! ఒక్క చిన్న విషయం కూడా మరచిపోలేదు. మనమూ అంతే లోతుగా పరిశీలించి గమనించాలి. అక్షరక్షరాన్ని చక్షురక్షరన్యాయంగా కంటితో పరిశీలించి తిక్కన కవితామహత్త్యాన్ని ఆస్వాదించాలి. ‘మీ తల్లియు, బంధులు’ ఉత్తరుడు యుద్ధానికి వచ్చినట్లు తల్లికి, బంధువులకు మాత్రమే తెలుసు కాని, తండ్రికి తెలియదు. ‘ఎడలు సంచలింప గుమురుగట్టి యెదురుసూతురు’ వాళ్ళందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తుంటారు. ‘వారికి ప్రియముగ శీఘ్రమ్మునం బురికిఁ బోవలయున్’ ఇంక మనం ఆలసించరాదు. వెంటనే వెళ్ళాలి. ఇంటికి వెళదాం అనగానే వెంటనే ఉత్తరుడి అలసట మాయమయిపోయింది. త్వరత్వరగా నడపసాగాడు. ‘అనిన నతండును రథంబు మగిడించినం జని చని’ - వాళ్ళు అలా తిరిగి వస్తున్నారు.

          ఆ కౌరవసేనలోని కొంత కాల్బలము దొరల రధాలను అనుసరించలేక వెనక పడిపోయారు. ‘కాలు తక్కువవారలు’ -ఎంత చక్కటి పదప్రయోగం! వేగంగా నడవ లేని వాళ్ళు. ‘కాలు తక్కువ వారలు కలయ చెదిరి’ అర్జునుడు వెనక్కి తిరిగాడేమిటా? అని బెదిరి పోయి, ‘వెనుకఁ బడిపోవునెడఁ దన్నుఁగని భయమున బ్రాణదానంబు వేఁడిన’ అర్జునుని శరణు కోరగా, ‘పార్థు డభయ హస్త మిచ్చుచు దయ పెనుపారఁ బలుకు’ భయం లేదు! నా లక్ష్యం వేరు. మిమ్మల్ని ఏమీ చేయను” అని అభయం ఇచ్చాడు. ‘ఇట్లు నానావిధదీనదశాదందహ్యమానులగు కృపణులం దన కృపామృతంబునం దడిపినం దేఱి వారు దీవించుచుం బ్రణమిల్లుచుం బొగడుచుం బోవుచుండ’ – హమ్మయ్య! బ్రతికాం, జయోస్తు! అని వాళ్ళు అర్జునుడిని దీవించారు. ‘ప్రణమిల్లుచుం బొగడుచుం’ - పెద్దవాళ్ళు దీవించారు, చిన్నవాళ్ళు ప్రణమిల్లారు. మిగతావాళ్ళు పొగుడుతూ పోయారు. ‘పోవుచుండ ధనంజయుండు భూమిం జయుం జూచి’ ఉత్తరుడు ఆత్యుత్సాహంతో తమ రహస్యాన్ని బట్టబయలు చేస్తాడేమో అని అర్జునుడు సంశయం.

Player
>>