కంకుని భంగపాటు1

ఉత్తరుని విజయవార్త

          ‘అనుచు నుత్తలపడు నయ్యవసరంబున నుత్తరుఁడు పుత్తెంచిన గోపాలురు పఱతెంచి యతనిం గాంచి’ – ఇలా విరాటుడు బాధపడుతున్న సమయంలో ఉత్తరుడు పంపిన ఆ గోపాలురు విరాటుని దర్శనార్థం వచ్చారు. ‘కురుబలమున్ జయించి మనగోవుల నెల్లను గ్రమ్మఱించి యు త్తరుఁడిదె తాను సూతుఁడు నుదగ్రత వచ్చుచు నున్నవాఁడు’ - మహారాజా! యువరాజులుంగారు కురుబలాన్నంతటినీ ఓడించి పశువులను మరల్చి విజయోత్సాహంతో వేంచేస్తున్నారు. ‘తత్తురగరథధ్వజాలి ఒక త్రుప్పుడు రాలదు’ – కనీసం ఉత్తరుడి రథం, అశ్వాలు, రథకేతనం కూడా ఏమాత్రం చెక్కుచెదరలేదు. ‘మమ్ము పిల్చి’ – మమ్మల్ని పిలిచి మీకు, పట్టణంలోని వారికి ఈవిషయం, ‘వే’ - తొందరగా వెళ్ళి, ‘పురి నెఱిఁగింపుఁ డన్న’ – తెలుపమని ఆజ్ఞాపించారు. ‘నృపపుంగవ! వచ్చితి మేము’ – వారి ఆజ్ఞానుసారం మేము వచ్చాము. అని అన్నారు. ‘నావుడు’, ఈ వార్త విని,

          ‘అంతరంగంబు నిండి’ – విరాటుని హృదయం గర్వంతో పొంగిపోయింది. ‘రెండలువులందు వెడలు సంతోషపూరంబు విధము దోఁప’ - అలువు అంటే రంధ్రం, రెండు కాలువలలో ప్రవహించే నదీప్రవాహము లాగా, ‘కన్నుఁ గవ’ కన్నుల జంట, రెండు కన్నులనుండి స్రవిస్తున్న ‘సమ్మదాశ్రులు గడలుకొనుచు’, ఆనందబాష్పాలు జారి, ‘గండపులకాంకురములతోఁ’  చెక్కిళ్ళపై పులకలు,  ‘క్రమ్ముదేర’ వ్యాపిస్తుంటే,  ‘ఏమేమీ! యని గోపస్తోమముఁ బలుమాఱు నడుగుచున్’ – ఆహా! ఎంత శుభవార్త చెప్పారు. ఇది నిజమా? అంటూ ఆ గోపాలురను పదే పదే అడుగుతున్నాడు. ‘మెయి పొదలన్’- ఒక్కొక్కరు పుత్రుని విజయం గురించి చెప్తుంటే శరీరం ఉప్పొంగింది.  ఆహా! నా కొడుకు ఎంత పరాక్రమవంతుడు! ఒంటరిగా వెళ్ళి విజయుడై వచ్చాడు అని విరాటుడు ఆనందంతో పొంగిపోతూ ‘భూమీశుఁడపుడు మంత్రుల మోములు గనుఁగొని’ – సభలో ఉన్న మంత్రులందరి ముఖాలవైపు, ‘సగర్వమున నిట్లనియెన్’ – సగర్వంగా చూస్తూ ఈ విధంగా పలికాడు.

          ‘వీటన్ వీథుల నెల్ల నేనుఁగులపై విస్ఫారఘంటా ధ్వనిం జాటంబంపుఁడు’ - మీరంతా ఉత్తరుడు సాధించిన విజయాన్ని రాజ్యమంతా తెలిసేలా ఏనుగుల మీద విస్ఫారఘంటాధ్వనులతో చాటింపు వేయించండి. రాజ్యమంతా మత్తగజాలను ఊరేగించండి. ‘పేర్మి నుత్తరు జయాశ్చర్యంబు పుణ్యాంగనా కోటిన్ పుచ్చుడు’ – ఉత్తరుడు వస్తుంటే హారతి నివ్వటానికి సలక్షణమైన ముత్తైదువులను ఎదురుపంపండి, ‘ఎదుర్కొనంగ మహితక్షోణీసురవ్రాతమున్ ఘోటస్యందన వారణప్రతతులం గూడన్ సతూర్యంబు గన్’ – మంగళ వాద్యఘోషముల నడుమ రథ, గజ, తురగ పదాది సమేతంగా ఉత్తరుని స్వాగతించడానికి వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు విరాటరాజు. అంతే కాదు, ‘ఉత్తమ కన్యా జనములు నుత్తరయును’- ఉత్తరుని విజయాన్ని స్వాగతిస్తూ ‘గంధమాల్యయుక్తముగఁ గుమారోత్తము నెదుర్కొనం దగు’ - ముత్తయిదువులు ఆశీర్వచనములతో హారతులు ఇస్తున్నప్పుడు మన ఇంటి ఆడపడుచు ఎదురువెళ్ళాలి. ముత్తయిదువులతో పాటు స్వాగత సత్కారాలకు ఉత్తరని పంపించండి. ‘అత్తెఱఁగున సంఘటింపుఁ డభిరామముగన్’ - వెళ్ళండి, అని పరివారాన్ని ఆజ్ఞాపించాడు.

Player
>>